ఆ వివరాలన్నీ తమరి దందాల కోసమా స్వామీ!..

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను సఫలవంతంగా నిర్వహించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొంది. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం అంటే అది చిన్న విషయం ఎంత మాత్రం కాదు. …

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను సఫలవంతంగా నిర్వహించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొంది. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం అంటే అది చిన్న విషయం ఎంత మాత్రం కాదు.  దాని ద్వారా  వేలకు వేల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఆశ ప్రజల్లో ఉంది. 

విశాఖ సమ్మిట్ తర్వాత,  ప్రజల దృష్టిలో ప్రభుత్వపు కీర్తి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ పరిణామాలను చూసి తెలుగుదేశం నాయకులు ఓర్వలేక పోతున్నారు. కింద మీద అయిపోతున్నారు. విశాఖ సమ్మిట్, పెట్టుబడులు,  పరిశ్రమలు..  ఈ వ్యవహారాలలో లోపాలు ఎన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బురద పులమడానికి నానాపాట్లు పడుతున్నారు! 

ఈ సమ్మిట్ కు ఎన్ని విదేశీ కంపెనీలను తీసుకువచ్చారో వాటి వివరాలు చెప్పాలని, అలాగే ఏయే కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు పెడుతున్నాయో, వాటికి ఎంత భూమి ఇస్తున్నారో, వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోందో చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు! నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రులు అమర్ నాధ్ రెడ్డి, దేవినేని ఉమా ఈ డిమాండ్లు చేశారు.

ఇలాంటి డిమాండ్లను వినిపించడంలోనే వారి సంకుచిత, కుట్రపూరిత అవినీతి బుద్ధి బయటపడిపోతోంది. పైగా తెలుగుదేశం వారి ఏడుపు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టుగా కూడా లేదు. 

అయినా ఒక ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరిగినప్పుడు.. వాటిద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటికి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. వాటిద్వారా ఎందరికి ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది? అనే విషయాల మీద ఎవరికైనా దృష్టి ఉండాలి. ఆదిశగా ప్రతిపక్షాల డిమాండ్ లు ఉండాలి. ఒప్పందాలు కాదు, సత్వరం యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, ప్రజలకు మేలు జరగాలని వారు కోరాలి. 

కానీ తెలుగుదేశం నాయకులు అదంతా పట్టించుకోవడం లేదు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల వివరాలు, పెట్టుబడుల వివరాలు, వాటికి దక్కే భూమి వివరాలు అడుగుతున్నారు. ఇదంతా కేవలం తాము దందా చేయడం కోసం అన్నది స్పష్టం. పెట్టే పెట్టుబడి, దక్కే భూమిని బట్టి.. ఆయా కంపెనీల వద్దకు వెళ్లి రాజకీయ బెదిరింపులకు దిగి, స్థానికంగా నిరసనలు గట్రా చేస్తామంటూ హెచ్చరించి..అందినంత దండుకోవడం తెదేపా వారికి అలవాటు. ఇప్పుడు ఆ వివరాలన్నీ గోప్యంగా ఉండేసరికి వారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. తమ దందా సాగదని అలమటించిపోతున్నారు.

తమ హయాంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో దందాలు నడిపించి.. శంకుస్థాపన, ప్రహరీ నిర్మాణం సమయానికే వారు విసిగి పారిపోయేలా దందాలు చేసిన సిగ్గుమాలిన తెదేపా నాయకులు.. ఇప్పుడు అదే కుట్రలతో చెలరేగుతున్నారు. 

విదేశీ కంపెనీలు ఎన్ని వచ్చాయి అని అడగడమే వారి కుట్రకు నిదర్శనం. సమ్మిట్‌లో విదేశీ అయితే ఏంటి? స్వదేశీ అయితే ఏంటి? కంపెనీలు రావడం, ఉద్యోగాలు రావడం ముఖ్యం. అయినా విదేశీ కంపెనీల ముసుగులో డొల్ల కంపెనీలతో స్వాహాలు చేయడం వారికి అలవాటు. అలాంటి అవకాశం ఇప్పుడులేకపోయేసరికి ఉడికిపోతున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే పెట్టుబడులకు మోకాలడ్డడానికి గుంభనంగా సాగిస్తున్న ఇలాంటి కుట్రలను ప్రజలు ఎన్నటికీ గమనిస్తుంటారు.