రంగులు జీవితంలోనే ఉంటాయి. రాజకీయాల్లో అయితే ఎన్ని రంగులో వేరే చెప్పాల్సినది లేదు. ప్రతీ పార్టీకి అనేక రంగులు వ్యవహారాలు ఉండడం సర్వ సాధారణం. హోళీ పండుగ అంటేనే రంగుల పండుగ. ఈ పండుగతో తన రాజకీయ క్షేత్రం మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు.
గతసారి హోళీ వేడుకలు విజయవాడలో జరుపుకున్నానని, ఈసారికి విశాఖలో హోళీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం అంటున్నారు. విశాఖ రంగులు ఎంపీ గారిని భలే నచ్చేశాయట. అందుకే ఆయన విశాఖలో రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
ఏడాది క్రితం హోళీ పండుగ వేళకు ఆయనకు విశాఖ నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేయాలన్న రంగుల కల వచ్చినట్లు లేదు.హోళీ పండుగ అందుకే విజయవాడలో చేసుకున్నారు. ఎంపీగా పోటీ అని ఎపుడైతే ఆలోచన వచ్చిందో విశాఖ కలర్స్ కి ఆయన ఆకర్షితులైనట్లుగా ఉన్నారు.
అయితే మిగిలిన వారి మాదిరిగా అద్దె ఇంట్లో ఉంటూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయం ముగిసాక దుకాణం సర్దేయకుండా విశాఖలో ఆయన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం అంటున్నారు.
విశాఖ నుంచి బీజేపీకి సరికొత్త రంగులు అద్దాలని ఆశపడుతున్న ఎంపీ గారు వచ్చే ఏడాది నాటికి ఎన్నికల బరిలో ఉండాలని ఆశిస్తున్నారు. ఎంపీ సీటు గెలిచిన చరిత్ర బీజేపీకి ఉంది కానీ పొత్తులతోనే అది సాధ్యపడింది. అందువల్ల బీజేపీ రంగు ఉంటే సరిపోదు మరికొన్ని రంగులు కలిస్తేనే జీవీఎల్ గారి రాజకీయ హోళీ ఆశలకు సార్ధకత ఉంటుందని అంటున్నారు.
అపుడు గెలుపు కూడా కొత్త కలరింగ్ తో కనిపించి కను విందు చేస్తుందని అంటున్నారు. హోళీ పండుగ వేళ విశాఖలో ఉద్యోగ వ్యాపారం నిమిత్తం స్థిరపడిన ఉత్తరాది ప్రజలకు ఎంపీ గారు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా తనదైన కొత్త కలర్స్ ని చూపించారు. ఇక మీదట ఆయన రాజకీయం మరెన్ని రంగులు పూసుకుంటుందో చూడాలని అంటున్నారు.