ఎమ్మెల్సీ కవితను విచారించడానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. 9వతేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా, మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో పదోతేదీన ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష చేయబోతున్నాను గనుక.. తనకు వీలుపడదని కవిత వారికి జవాబిచ్చింది. 9వ తేదీన రావడం కుదరదని, కావలిస్తే 15న వస్తానని సమాచారం ఇచ్చింది.
అయితే 10వతేదీ దీక్ష ముగిసిపోతుండగా.. 15వ తేదీ దాకా గడువు ఎందుకు? ఒకవైపు ఈడీ, సీబీఐ విచారణల్ని దారుణంగా నిందిస్తూనే, అదే సమయంలో.. కేంద్రప్రభుత్వం చేతుల్లో ఈ విచారణ సంస్థలు కీలుబొమ్మల్లాగా మారుతున్నాయని అంటూనే.. వారికి తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, వారు అడిగిన అన్ని వివరాలు తెలియజేస్తానని కవిత అంటున్నారు.
అంతా బాగుంది గానీ.. దీక్ష ముగిసిపోయిన తర్వాత.. ఏకంగా అయిదురోజుల తర్వాతి గడువు చెప్పడం చిత్రంగా ఉంది. అయితే విచారణ సందర్భంగా మరింత లోతుగా ఇరుక్కోకుండా తీసుకోగల కనీస జాగ్రత్తల కోసమే కవిత ఆ గడువు కోరినట్లుగా పలువురు భావిస్తున్నారు.
కవిత బినామీగా, మొత్తం లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి మరియు పాత్రధారిగా పేర్కొంటున్న అరుణ్ పిళ్లై మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసి సీబీఐ కోర్టులో హాజరుపరచింది. ఈడీ వారం రోజుల కస్టడీకి కూడా తీసుకుంది. అరుణ్ పిళ్లై కవితకు బినామీ, ఆమె తరఫున వ్యవహారాలు అన్నీ ఆయనే నడిపించారని కోర్టుకు సమర్పించిన వివరాల్లో పేర్కొన్నారు. అరుణ్ పిళ్లై ను కస్టడీకి అప్పగించే విషయంలో కోర్టు చాలా ఖచ్చితంగా వ్యవహరించింది. తల్లికి అనారోగ్యం వంటి కారణాలు చెప్పినా సరే పట్టించుకోలేదు. అయితే.. అరుణ్ పిళ్లై తమ కస్టడీలో ఉండగా, ఆ విచారణ సాగుతున్న సమయంలోనే కవితను కూడా పిలిపించడానికి ఈడీ నిర్ణయించింది అన్నది స్పష్టం.
కవిత కోరిన గడువు వెనుక కూడా అదే కారణం అనిపిస్తోంది. వారం రోజుల కస్టడీ 14వ తేదీకి ముగిసే అవకాశం ఉంది. ఏకకాలంలో తనను- అరుణ్ పిళ్లైను కలిపి విచారించకుండా తప్పించుకోవడానికి కవిత 15న వస్తానని చెప్పినట్లుగా పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అరుణ్ పిళ్లై విచారణ 15న ఉన్నా కూడా.. ఒక్కరోజులో ప్రాథమిక వివరాల సేకరణకే సరిపోతుందని.. తనను రెండోరోజు రావాలని ఈడీ కోరినా కూడా.. అప్పటికి అరుణ్ పిళ్లై వారి కస్టడీలో ఉండడని అంచనా వేసినట్లుగా అనుకుంటున్నారు.
అయితే.. అంతా కవిత వ్యూహం ప్రకారమే జరుగుతుందా? ఈడీ కోర్టులో మళ్లీ విన్నవించి.. కవిత వచ్చే తేదీలకు అరుణ్ ను తిరిగి కస్టడీలోకి తీసుకుంటుందా.. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే పరిస్థితి వస్తుందా? అనేది వేచిచూడాలి.