అవతార్-2 అనుకున్నట్టుగానే థియేటర్లలో హిట్టయింది. ఇప్పుడు డిజిటల్ స్క్రీనింగ్ కి కూడా రెడీ అయింది. అయితే డిజిటల్ లో కూడా మూవీ ఆన్ డిమాండ్ పేరుతో కొంతకాలం డబ్బులు చెల్లించి చూడాల్సిందే. గతంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా ఇలాగే మూవీ ఆన్ డిమాండ్ పేరుతో ఓటీటీలలోకి తెచ్చారు. అంతెందుకు ఆర్ఆర్ఆర్ కూడా మొదట్లో ఇలాగే ఓటీటీల్లోకి వచ్చింది. ఆ తర్వాత సబ్ స్క్రైబర్లు అందరూ చూసేలా అందుబాటులోకి తెచ్చారు.
ఇప్పుడు అవతార్-2 కూడా ఇలాగే డిజిటల్ స్క్రీన్లపై ప్రత్యక్షం కాబోతోంది. కొన్ని రోజులపాటు డబ్బులు చెల్లిస్తేనే స్పెషల్ షోస్ వేస్తారు. ఆ తర్వాత సబ్ స్క్రైబర్లందరికీ షో అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, తదితర ఓటీటీ వేదికల్లోల ఇది స్ట్రీమింగ్ అవుతుంది.
మార్చి-28నుంచి..
2022 డిసెంబర్-6న అవతార్-2 లండన్ లో విడుదలైంది. ఆ తర్వాత డిసెంబర్-16నుంచి అమెరికా సహా ఇండియన్ బాక్సాఫీస్ వద్దకూడా షో లు పడ్డాయి. మూడు నెలల 2 వారాలకు ఇప్పుడు ఆ సినిమాని డిజిటల్ స్క్రీనింగ్ కి రెడీ చేశారు.
మార్చి 28నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఉడు.. సహా మరికొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అవతార్-2 అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి కొన్నాళ్ల క్రితమే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అవతార్ అఫిషియల్ డిజిటల్ స్క్రీనింగ్ కి సంబంధించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
4కె అల్ట్రా హెచ్.డి., డాల్బీ అట్మాస్ ఆడియోతో డిజిటల్ స్క్రీన్ లో 3గంటల అవతార్ విజువల్ వండర్ ని మనం చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తే, రెండో పార్ట్ లో సముద్రం అడుగున ఉన్న మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘ది వే ఆఫ్ వాటర్’ అంటూ నీటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అవతార్ డిజిటల్ స్క్రీనింగ్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.