పెట్టుబడులపై నీతీ రీతీ లేని కువిమర్శలు!

ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా నిర్మాణాత్మక విమర్శలతో వ్యవహరించాలి. వారి విమర్శలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి, తప్పుదారి పట్టకుండా నడిపించేందుకు ఉపయోగపడాలి. అయితే ఒక పద్ధతి పాడు లేకుండా, కనీస నైతిక విలువలు కూడా లేకుండా..…

ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా నిర్మాణాత్మక విమర్శలతో వ్యవహరించాలి. వారి విమర్శలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి, తప్పుదారి పట్టకుండా నడిపించేందుకు ఉపయోగపడాలి. అయితే ఒక పద్ధతి పాడు లేకుండా, కనీస నైతిక విలువలు కూడా లేకుండా.. ప్రభుత్వ కార్యకలాపాల మీద ప్రజల్లో అనుమానాలు పుట్టించడమే లక్ష్యంగా విమర్శలు సాగిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నీతీ రీతీ లేని కువిమర్శలకు దిగితే ప్రజలు ఎలా సహిస్తారు. విలువలకు పెద్దపీట వేస్తాం అని చెప్పుకునే కమలదళం నుంచి కూడా ఇలాంటి పోకడలను చూడాల్సి వస్తోంది. 

తెలుగుదేశం నుంచి బిజెపిలోకి ఫిరాయించి.. అక్కడ ప్రస్తుతం చంద్రబాబు ఎజెండాను అమలుచేస్తున్న నాయకుల్లో ఒకరైన లంకా దినకర్ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రూపంలో ఒక పెద్ద భూదందాకు తెరలేపారట. భూములు ఇవ్వకుండా కంపెనీలు ప్రారంభం కావడం ఎలాగ? ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కొన్ని ఏడాది ముందునుంచి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తున్నాయట. 

అవును నిజమే.. సాగించకుండా ఎలా ఉంటాయి? సమ్మిట్ కు వచ్చే ప్రతిదీ హఠాత్తుగా ఇప్పుడే రావాలని ఆశించడం కూడా సబబు కాదు కదా! కానీ ఆ కారణాలు చెబుతూ.. అవన్నీ ముఖ్యమంత్రి సన్నిహితులకు దోచిపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం అని లంకా దినకర్ మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంలో ఉన్నారు. 

కమలదళంలో ఉంటూ చంద్రబాబునాయుడు ఇచ్చిన స్క్రిప్టులను  ప్రెస్ మీట్ లలో చదివే నాయకుడిగా లంకా దినకర్ కు అనన్యమైన కీర్తి ప్రతిష్టలున్నాయి. ఇలాంటి కోవర్టు ఆపరేషన్ లు చేస్తున్నందుకే.. గతంలో ఓసారి పార్టీ సారధి సోమువీర్రాజు లంకా దినకర్ ను సస్పెండ్ చేశారు కూడా. ఇప్పుడు ఆయన మాటలు కూడా.. కాషాయ కండువా కిందనుంచి వస్తున్నాయి గానీ.. అచ్చంగా పచ్చ వాసన కొడుతున్నాయి. 

విశాఖ సమ్మిట్ లో పెట్టుబడుల వెల్లువతో జడుసుకున్న చంద్రబాబునాయుడు.. ఆ సమ్మిట్ సాధించిన విజయాల మీద ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించడానికి రకరకాల కుట్రమార్గాలను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. 

కేవలం తమ ఒక్క పార్టీ ద్వారా మాత్రమే నిందలు వేస్తే ప్రజల్లో విలువ ఉండదు గనుక.. లంకా దినకర్ లాంటి తన పెయిడ్ ఆర్టిస్టులతో కూడా బిజెపి టీమ్ నుంచి అర్థం పర్థం లేని నిందలు వేయిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో.. తెలుగుదేశంలో చేరుతారని ప్రచారంలో ఉన్న బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకూడా.. ఈ పెట్టుబడుల్లో క్విడ్ ప్రోకో ఉన్నదని సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం.