మొన్న పవన్ కల్యాణ్, నిన్న నాని, ఆ తర్వాత సిద్ధార్థ్.. ఎవరైతే ఏంటి.. ఈ సినిమా నటులు టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వాన్ని ఒకరి తర్వాత మరొకరు రెచ్చగొడుతున్నారు. సయోధ్యతో, మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని… వీళ్లు తమదైన అహంకారంతో డీల్ చేస్తున్నారు తప్ప, సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం మాత్రం కనిపించడం లేదు.
కోర్టుకు వెళతాం అనే దగ్గర నుంచి…లక్షల కోట్ల రూపాయల అవినీతి.. అనే వరకూ వచ్చారు! అచ్చంగా రాజకీయ నేతల తరహాలో మాట్లాడుతూ ఉన్నారు ఈ సినిమా నటులు. ఎక్కడో తమిళనాడులో తలదాచుకునే సిద్ధార్థ్ ఎన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడో కానీ.. టికెట్ల విషయంలో చాలా బాధపడుతున్నాడు పాపం!
ఇదంతా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే తీరులో.. మంత్రులను అవమానపరిచే రీతిలో సాగుతూ ఉంది. దీని వల్ల నష్టం ఎవరికో కూడా వేరే చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకూ మంత్రి పేర్ని నాని నిర్మాతలను సాదరంగానే ఆహ్వానించి మాట్లాడారు. అయితే అహంకారాన్ని రంగరించుకున్న సినిమా నటులు ఇప్పుడు అలాంటి వారినే టార్గెట్ గా చేసుకుంటున్నారు. సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ.. తమ అహంభావాన్ని చాటుకుంటూ ఉన్నారు.
తాము మాత్రమే నిజాయితీ పరులం అంతా చెడ్డోళ్లు అన్నట్టుగా ఉంది ఈ నటుల తీరు. సినిమా ఇండస్ట్రీ అంటేనే బ్లాక్ మనీకి అడ్డా అనే ప్రచారమూ ఉంది కదా! మరి సిద్ధార్థ్ లాంటి ఫేడ్ ఔట్ అయిన నటులైనా తామెంత పారితోషికం తీసుకుంటున్నామో, తమ సినిమాల బడ్జెట్ ఎంత, వాటి వసూళ్లెంత, మొత్తం పన్నుల లెక్కెంత.. అనే విషయాలను ఓపెన్ గా డిస్కషన్లో పెట్టగలరా?
మాటెత్తితే తామే పన్నులు చెల్లిస్తున్నట్టుగా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అత్యంత నిజాయితీతో కూడుకున్నదన్నట్టుగా ఈ నటులు ఇస్తున్న కలరింగ్ కామెడీ అవుతోంది. దానికి తోడు అహంకారం ఫలితంగా.. వ్యవహారం మరింత కంపు అవుతోంది.