తన సినిమాల్లో ఆకతాయి మాటలు మాట్లాడుతూ ఉంటాడు నటుడు నాని. చాలా సినిమాల్లో నాని పాత్రలు ఆకతాయి గానే ఉంటాయి. హీరోయిన్ ని ఉద్దేశించి అయినా, హీరోయిన్ పేరెంట్స్ ను ఉద్దేశించి అయినా.. స్నేహితుల గురించి అయినా నాని పాత్రలు ఆకతాయిలాగానే మాట్లాడతాయి. విశేషం ఏమిటంటే.. అదే హీరోయిజం అయ్యింది.
ఒకటని కాదు… నేను లోకల్, నిన్నుకోరి, కృష్ణగాడి వీర ప్రేమగాథ.. ఇలాంటి సినిమాల్లో తన చుట్టూ ఉన్న పాత్రలన్నింటినీ ఏడిపిస్తూ, వారిపై సెటైర్ల పేరుతో డైలాగులు వేస్తూ సాగుతుంటాయి నాని ధరించిన పాత్రలు. అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆక్సిజన్ లెవల్ గురించి ఒక పాత్ర మాట్లాడితే, ఆపరేషన్ థియేటర్ కు వెళితే వంద శాతం ఆక్సిజన్ అంటూ.. వెటకారం ఆడుతాడు నాని ఒక సినిమాలో.
మరి సినిమాల్లో చేసి చేసి అలాంటి వెటకారమే అలవాటు అయ్యిందేమో! సినిమా టికెట్ల వ్యవహారం గురించి అదే తరహాలో మాట్లాడి కంపు చేశాడు ఈ నటుడు. సినిమాల్లో హీరో ఏది మాట్లాడితే అదే పంచ్. హీరో పాత్ర ఏం చేసినా అది అర్థవంతమే! హీరోయిన్ తండ్రిని బఫూన్ లా ట్రీట్ చేసినా, తన స్నేహితులను కమేడియన్లను చేసినా, హీరోయిన్ నే తిక్కదాన్ని చేసినా.. ఏం చేసినా అది హీరోయిజమే. ఇదంతా నాని సినిమాల్లోదే. అయితే వాస్తవంలో మాత్రం అలా ఉండదని ఇప్పుడిప్పుడు ఈ హీరోకి అర్థం అవుతూ ఉండవచ్చు!
కిరాణా కొట్టు పోలికలతో నాని తను ట్రోల్ కు గురి కావడమే కాదు, ఇండస్ట్రీనే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలబెట్టాడు. ఇప్పటికి మించి పోయింది ఏమీ లేదు, ప్రభుత్వంతో చర్చించి, టికెట్ల వ్యవహారం గురించి మాట్లాడుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమకు అవకాశం మిగిలే ఉండేది నాని మాటలకు ముందు! అయితే.. ఈ అనుచిత ప్రేలాపనతో నాని ఇండస్ట్రీని కార్నర్ లో నిలబెట్టాడు. నాని కామెంట్లపై మంత్రులు స్పందించడం, టీవీ చానళ్ల వాళ్లు చర్చా కార్యక్రమాలను పెట్టి, అధికార పార్టీ నేతలతో ప్రత్యేక లైవ్ డిబేట్లను పెట్టడంతో.. వ్యవహారం మరింత అగ్గిరాజుకుంటోంది తప్ప చల్లారడం లేదు.
ఒక చానల్ లైవ్ షోలో అంబటి రాంబాబు మాట్లాడుతూ… టికెట్ల రేట్ల విషయంలో అభ్యంతరం ఉంటే, ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని, నానినో, పవన్ కల్యాణ్ నో.. వీళ్లు ఇష్టానుసారం మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా? అని సూటిగా ప్రశ్నించారు. మైకులు కనిపించాయి కదా.. అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడటం ఎంత అనుచితమో ఇప్పుడు నానికి అర్థం అవుతూ ఉండవచ్చు. పవన్ కల్యాణ్ మాట్లాడితేనే, ఇండస్ట్రీ మద్దతుగా వెళ్లలేకపోయింది! అలాంటిది నాని మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం ఎంత? అందులోనూ పద్ధతిగా విన్నవించుకుంటే అదో లెక్క. అలా కాకుండా.. తన సినిమా హీరోయిజాన్ని చూపించి నాని మొత్తం వ్యవహారాన్ని కంపు లేపాడు!