బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో వుంటూ ఏ పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నావో చెప్పాలని గట్టిగా నిలదీశారు. ఏపీ పోలీసులపై సీఎం రమేశ్‌నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో మల్లాది విష్ణు తన మార్క్ దూకుడు ప్రదర్శించారు. సీఎం రమేశ్‌పై ఓ రేంజ్‌లో ఆయన ఫైర్ అయ్యారు.
ముందుగా ఏపీ పోలీసులపై సీఎం రమేశ్ చేసిన విమర్శలేంటో తెలుసుకుందాం.
‘ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. అవసరమైతే కొందరు ఐపీఎస్‌లను కేంద్రం రీకాల్ చేస్తుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఇక్కడేం జరుగుతుందో వివరించాం. వారు ఇక్కడ టెలిస్కోప్‌లో చూస్తున్నారు. ఇకమీదట ఐపీఎస్, ఐఏఎస్ ఆటలు సాగవు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కానీ వ్యవస్థలు ఎప్పటికీ ఉంటాయి ’ అని సీఎం రమేశ్ తన శైలిలో బెదిరింపులకు దిగారు.
ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు మీడియా ముందుకొచ్చారు. సీఎం రమేశ్ బెదిరింపు ధోరణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసుల సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు. కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
ఇంతకూ తమరు బీజేపీ తరపున లేక టీడీపీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని సీఎం రమేశ్‌ను నిలదీశారు. ఏపీ బీజేపీలో రెండు రకాల నాయకులు ఉన్నారని చెప్పారు. ఒరిజినల్ బీజేపీ, డమ్మీ బీజేపీ నేతలు ఉన్నారని ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్లు డమ్మీ బీజేపీ నేతలనే అర్థం ధ్వనించేలా ఆయన మాట్లాడారు.
ఇటీవల కాలంలో టీడీపీ అనుకూల బీజేపీ నేతల స్వరం నెమ్మదిగా పెరుగుతోంది. బీజేపీకి నష్టం వచ్చేలా ఆ పార్టీలోని కొందరు నేతలు ప్రవర్తిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అసలు సిసలు బీజేపీ నేతలు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.