చిత్రం: శ్యాం సింగరాయ్
రేటింగ్: 2.75/5
తారాగణం: నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, జిషు సేన్ గుప్త, భూపాల్, రాహుల్ రవింద్ర, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, మడొన్నా సెబాస్టియన్ తదితరులు
కెమెరా: సాను జాన్ వర్గీస్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: మిక్కి జె మెయెర్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: రాహుల్ సంకృత్యన్
విడుదల తేదీ: 24 డిసెంబర్ 2021
1949 నుంచి భారతీయ తెర మీద పునర్జన్మల నేపథ్యంలో సినిమాలొస్తూనే ఉన్నాయి. మూగమనసులు, యముడికి మొగుడు, కర్జ్, కరణ్ అర్జున్, ఓం శాంతి ఓం, మగధీర ఇలా ఎన్నో సినిమాలు ఆ కోవలో పాపులర్ అయినవి కూడా ఉన్నాయి. అయితే వాటిల్లో లాజిక్ కంటే ఎమోషనల్ మ్యాజిక్ డామినేట్ చేయడంతో ప్రేక్షకుల్ని రంజింపజేసాయి.
ఇక “శ్యాం సింగరాయ్” విషయానికొస్తే ఇది కూడా పునర్జన్మ కథే. అయితే మ్యాజిక్ ని క్రియేట్ చేయడంలో పూర్తిగా కృతకృత్యులు కాలేకపోయారు.
విషయంలోకి వెళితే, 2021లో షార్ట్ ఫిలింస్ తీసుకునే వాసుదేవ్ కి శ్యాం సింగరాయ్ కి ఉన్న గత జన్మ లింకుని చూపించడమే ఈ చిత్రకథలోని సారాంశం.
శ్యాం సింగరాయ్ ఒకప్పటి రాజారాం మోహన్ రాయ్ లాగ సంఘ సంస్కర్త. ఆయుధం పట్టి ఉద్యమంలోకి రమ్మని పిలుపొచ్చినా గన్ను కంటే పెన్నునే నమ్ముకున్న వ్యక్తి సింగరాయ్. అస్పృశ్యత, దేవదాశీ వ్యవస్థల మీద అతని పోరాటం. ఆ కథంతా 1970ల నేపథ్యంలో జరుగుతుంటుంది.
ఇక కథాగమనానికి వస్తే తొలి సగంలో కనపడినంత బిగువు మలి సగంలో కనపడలేదు. ఏదో జరుగుతోందన్న ఆసక్తి, ఏమయ్యుంటుందా అనే ఉత్సుకత, పునర్జన్మ కాన్సెప్ట్ అని తెలిసినా కూడా కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహం ప్రేక్షకుడికి కలుగుతాయి ఇంటర్వల్ వరకు.
కానీ ద్వితీయార్థంలో ఆ ఆసక్తి, ఉత్సాహం కాస్త చల్లబడతాయి. మంచి పీక్ లోకి తీసుకెళ్ళి ఇంటర్వల్ ఇచ్చి, రెండవ సగం మొదట్లో “మొదటి రాత్రి…రెండవ రాత్రి…” అంటూ సబ్ టైటిల్స్ వేస్తూ “తొమ్మిదవ రాత్రి” పడే వరకు హీరోహీరోయిన్స్ మీద నడిచిన లవ్ ట్రాక్ నీరసం తెప్పిస్తుంది.
గ్రిప్పింగ్ గా నడిచే కథలో పునర్జన్మల్ని నిజమని నమ్మించడానికి కోర్టులో జరిగే వాదప్రతివాదనలు మ్యాజిక్ కి మింగేసి లాజిక్ ని పట్టుకొచ్చాయి. అక్కడే ఎమోషనల్ డ్రామా డ్రాప్ అయ్యింది.
నడుస్తున్న కథ క్లైమాక్స్ కి వచ్చే సరికి మరీ పేలవంగా 1978 నాటి “దేవదాసు మళ్లీ పుట్టాడు” క్లైమాక్స్ ఛాయల్లో ఉండడం ఆశ్చర్యమేస్తుంది. అప్పటి వరకు తెలివిగా నడిచిన కథనం చివర్లో అంత ప్రెడిక్టిబుల్ గా పాతచింతకాయ పద్ధతిలో ముగియడం వల్ల రొట్టె విరిగి పొయ్యిలో పడ్డట్టయ్యింది.
తీయడంలోన కొత్తదనముంది కానీ కథలో ఉన్న అంశాలు, ట్విస్టులు కొత్తగా అనిపించవు.
ఈ కథలో ప్రధానమైన మైనస్ ఏంటంటే జన్మాంతరప్రేమ తప్ప జన్మాంతరవైరం లేకపోవడం. “మగధీర”లో లాగ రివెంజ్ డ్రామా నడవడానికి పాత జన్మలో విలన్ మళ్లీ పుట్టి రాడు. దానివల్ల యాక్షన్ డ్రామా లేదు.
సాంకేతికంగా చూస్తే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. కళాదర్శకుడిని ప్రశంసించాలి. 1970 ల నాటి కలకత్తాని, బెంగాల్ ని పునఃసృష్టి చేయడానికి తగిన కళా దర్శకత్వం బాగా పనిచేసింది.
వాసుదేవ్, శ్యాం సింగరాయ్.. రెండు పాత్రల్నీ నానీ చక్కగా పోషించాడు. మరీ ముఖ్యంగా శ్యాం సింగరాయ్ గా నిండుగా కనిపించాడు. అతని మాటల్లోనే ఆహార్యం, ఆంగికం, వాచకం అన్నీ బెంగాలీ యువకుడికి తగ్గట్టుగా బాగా అమరాయి. నానీ కృషి ప్రశంశనీయం.
అదలా ఉంటే సాయిపల్లవి అనగానే ప్రేక్షకులు ఆమె నుంచి ఊహాతీతమైన డ్యాన్స్ స్టెప్స్ ని ఆశించడం సహజం..అది శాస్త్రీయనృత్యమైనా సరే. కానీ అటువంటి విన్యాసాలేవీ లేవిందులో. ఒక రకంగా సాయిపల్లవి కాకుండా ఏ హీరోయిన్ అయినా ఈ పాత్రకి సెట్టవుతుంది కదా అనిపిస్తుంది. అలా ఆర్టిస్టులోని ప్రత్యేకతని చాటకపోవడం ఒక మైనస్.
కృతి శెట్టి మొదటి సగంలో కాసేపు కనిపిస్తుంది తప్ప తర్వాత సైడైపోయింది.
జిషుసేన్ గుప్తా, భూపాల్ పాత్రలకు పెద్ద నిడివైతే లేదు. రాహుల్ రవింద్రది మాత్రం చెప్పుకోదగ్గ చిన్న పాత్ర.
మడొన్నాసెబాస్టియన్ డిఫెన్స్ లాయర్ గా ఓకే. మురళి శర్మ ఎప్పటిలాగే చిన్న పాత్రైనా ఎంగేజ్ చేసాడు.
ఏది ఏమైనా పోస్టర్ మీద ఆకట్టుకున్న “శ్యాం సింగరాయ్” తెర మీద ఆకట్టుకోవడంలో కాస్త వెనకబడ్డాడు. రెండవ సగాన్ని మరింత బలంగా మలచుకుని ఉంటే సినిమా స్థాయి వేరేగా ఉండేది.
ఇలాంటి కథల్ని ప్రెడిక్టిబుల్ లైన్స్ లో ముగించకుండా 'ఔట్ ఆఫ్ ది బాక్స్” గా ఏదైనా ఆలోచించి ఉండాల్సింది.
ఈ సినిమా ఎలాగుందో చెప్పాలంటే..నెత్తిన పెట్టుకునే విధంగానూ లేదు, అలాగని పూర్తిగా తీసి పారేసేలాగ కూడా లేదు. మంచి ప్రయత్నం, కానీ ఏదో వెలితి.
బాటం లైన్: దేవదాసు మళ్లీ పుట్టాడు