ఏపీ మంత్రుల‌పై హీరో ఘాటు వ్యాఖ్య‌లు

ఏపీ మంత్రుల‌పై హీరో సిద్ధార్థ్ ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వం, సినీ ఇండ‌స్ట్రీ మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. నేచుర‌ల్ స్టార్ నాని నిన్న‌టి ప్రెస్‌మీట్లో…

ఏపీ మంత్రుల‌పై హీరో సిద్ధార్థ్ ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వం, సినీ ఇండ‌స్ట్రీ మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. నేచుర‌ల్ స్టార్ నాని నిన్న‌టి ప్రెస్‌మీట్లో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వం, సినీ ఇండ‌స్ట్రీ మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెంచాయి. నానిపై ఏపీ మంత్రులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

కేవ‌లం రెమ్యున‌రేష‌న్ త‌గ్గుతుంద‌నే బాధ‌తోనే టికెట్ల రేట్ల‌ను పెంచాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నార‌ని మంత్రులు విమ‌ర్శించారు. ముందుగా త‌మ రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకుంటే ప్రేక్ష‌కుల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌తో టికెట్లు విక్ర‌యించొచ్చ‌ని మంత్రులు హిత‌వు చెప్పారు. ఈ గొడ‌వ‌లోకి హీరో సిద్ధార్థ్ ఎంట‌ర్ అయ్యారు. ఏపీ మంత్రుల‌పై త‌న‌దైన శైలిలో తీవ్రంగా విరుచుకుప‌డ్డారు.

‘ సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. మరి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంత మంది విలాసాలకు ఖర్చుపెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’ అంటూ ట్వీట్‌ చేశారాయ‌న‌.

ప్ర‌త్యేకంగా ఫ‌లానా వ్య‌క్తి గురించి అని ప్ర‌స్తావించ‌క‌పోయినా… గ‌త కొంత కాలంగా సాగుతున్న ప‌రిణామాల రీత్యా సిద్ధార్థ్ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించో సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సినీ ఇండ‌స్ట్రీపై క‌క్ష క‌ట్ట మ‌రీ థియేట‌ర్ల‌పై దాడులు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో సిద్ధార్థ్ ట్వీట్ ఏ మ‌లుపు తీసుకోనుందో చూడాలి. మొత్తానికి ఈ స‌మ‌స్య‌కు ఎప్పుడు తెర‌ప‌డుతుందో అనే ఆందోళ‌న నెల‌కుంది.