ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భయపెట్టే వాళ్లకు కొదవలేదు. జగన్‌ను బెదిరించడానికి తాను సైతం అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని ఆయన అన్నారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందనడం గమనార్హం. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసలుబాటు కల్పించిందన్నారు.
సినిమా రేట్లపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై ఎందుకు లేదని సీఎం రమేశ్ నిలదీశారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా? అని మండిపడ్డారు. పలికేది సీఎం రమేశ్ అయినా, పలకించేది ఎవరో ఆంధ్ర ప్రజానీకానికి బాగా తెలుసునని సీఎం రమేశ్‌పై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి తమ పార్టీ ఏలుబడిలో రాష్ట్రం ఎంత బాగా వెలుగొందుతోందో చూడాలని హితవు చెబుతున్నారు. జగన్‌ను బెదిరంచడానికి కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై శ్రద్ధ చూపితే బాగుంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు.