సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకూ వివాదాన్నిపెద్దది చేస్తోంది. థియేటర్ల రోజువారీ కలెక్షన్లు అధ్వానంగా ఉన్నాయని, పక్కనున్న కిరాణా షాపు కలెక్షనే ఎక్కువగా ఉందంటూ హీరో నాని చేసిన విమర్శలపై ప్రభుత్వం దీటుగా స్పందించింది. ఇప్పటికే నానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నెల్లూరులో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచాలని కోరుతున్న వారిపై విరుచుకుపడ్డారు.
హీరో నాని ఎవరో తనకు తెలియదని మంత్రి వ్యంగ్యంగా అన్నారు. తనకు తెలిసిందల్లా మంత్రి కొడాలి నాని మాత్రమే అని మంత్రి అన్నారు. కేవలం టికెట్ రేట్ తగ్గితే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధతోనే కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రూ.50 కోట్ల రెమ్యునరేషన్ రూ.25 లేదా రూ.30 కోట్లకు తగ్గుతుందనే బాధ తప్ప, వారి ఆవేదనలో అర్థం లేదన్నారు.
భీమ్లా నాయక్, వకీల్‌సాబ్‌కి పెట్టిన ఖర్చెంత?. పవన్‌కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ప్రజలని ఉద్దరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ తన క్రేజ్‌ని అమ్ముకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను కూడా బైక్ అమ్మి పవన్‌కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టానన్నారు. ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. పవన్ అభిమానుల పరిస్థితి కూడా అంతేనన్నారు.
ప్రొడక్షన్ కాస్ట్ 30శాతం అయితే రెమ్యునరేషన్ 70శాతం ఉందన్నారు. సినిమాకయ్యే ఖర్చులో 80శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయన్నారు. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారంపడేలా సినిమా రేట్లు పెంచమనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మంత్రి అనిల్ మండిపడ్డారు. అలాంటి వాళ్ల కోసం టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతించాలా? అని మంత్రి నిలదీశారు.
గతంలో చారిత్రక సినిమాలకు మాత్రమే రేట్లు పెంచాలని కోరే వారన్నారు. అమ్మానాన్నల శ్రమను సినీ హీరోలు దోచుకుంటున్నారని గ్రహించాలని విన్నవించారు.