ప్రతి ఏడాది క్రిస్మస్‌కు పులివెందుల వెళ్లడం వైఎస్ కుటుంబానికి ఆనవాయితీ. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబ సభ్యులంతా కలసి సంతోషంగా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం తెలిసిందే. వైఎస్సార్ మరణానంతరం కూడా ఆ ఆనవాయితీని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, క్రిస్మస్‌కు కడప జిల్లాకు వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేవారు. వైఎస్సార్ హయాంలో కడప జిల్లా ఎంతో అభివృద్ధి సాధించింది.
కానీ వైఎస్ జగన్ విషయానికి వస్తే… శంకుస్థాపనలకే పరిమితమయ్యారనే ఆరోపణలున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు దఫాలు క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు కడప జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
మొదటి సారి రాయచోటిలో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. అయితే ఇప్పటి వరకూ పనులు చేపట్టలేదనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు విడుదల చేయలేదనే విమర్శలున్నాయి.
రెండోసారి క్రిస్మన్ వేడుకలకు వెళ్లినప్పుడు కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో కూడా ఇదే రీతిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తాజాగా ముచ్చటగా మూడోసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రూ.500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయడం విశేషం.
రెండేళ్ల క్రితం కుందూ నదిపై ఎత్తిపోతల పథకానికి పునాది రాయి వేసి, చిన్న ఇటుక కూడా వేయలేదని ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఇదే రీతిలో కడప జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం సర్వ సాధారణ విషయంగా జరిగిపోయింది.
ఇప్పుడు జగన్ కూడా అదే రీతిలో శంకుస్థాపనలకే పరిమితం కావడంతో, శిలాఫలకలు వెక్కిరిస్తున్నాయని జనం వాపోతున్నారు. శంకుస్థాపనలు చేసిన పనులను కనీసం రెండేళ్లకైనా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.