ఒకే వేదికపైకి ఇద్దరు ప్రముఖులు రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే వేదిక మీద కనిపించనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, మరో ముగ్గురు న్యాయమూర్తులపై సీఎం జగన్ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విషయాల్లో జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని, అలాగే ఇతరేతర అంశాలను ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
జస్టిస్ ఎన్వీ రమణను ప్రత్యర్థి వర్గంలో వైసీపీ జమ కట్టి, పరోక్షంగా విమర్శలు కూడా చేస్తూ వుంటుంది. జస్టిస్ ఎన్వీ రమణ చివరికి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత ఆయన మొదటిసారిగా కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉండనున్నారు. పలు పౌర సన్మానాలు అందుకోనున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం ఏపీ ప్రభుత్వం తేనీటి విందును ఏర్పాటు చేసింది. ఈ నెల 25న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి జగన్ పాల్గొననుండడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా పాల్గొంటారు. జస్టిస్ ఎన్వీ రమణ, జగన్ పరస్పరం కలుసుకోవడం ఆసక్తికర, శుభపరిణామంగా చెప్పొచ్చు.