అధికారులపై నాయకులు పెత్తనం చలాయిస్తుంటారని అంటారు, కానీ కొన్నిసార్లు అధికారులే నాయకుల్ని ముప్పతిప్పలు పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. సరిగ్గా నెల్లూరు కార్పొరేషన్లో ఇదే జరుగుతోంది. అనుకోకుండా అదృష్టం వరించి గిరిజన మహిళ స్రవంతి నెల్లూరు నగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికయ్యారు.
ఆమెకు రాజకీయాలు పూర్తిగా కొత్త, అందులోనూ గిరిజన మహిళ కావడంతో.. నయా పాలిటిక్స్ ని ఆమె అవగాహన చేసుకోడానికి బాగా టైమ్ పడుతుంది. ఈలోగా.. నెల్లూరు నగర కమిషనర్ పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేషన్లో గిరిజన మేయర్ స్రవంతి, కమిషనర్ కి మధ్య యుద్ధం మొదలైంది. గిరిజన యువతి అనే కారణంగా మేయర్ ను, కమిషనర్ చిన్న చూపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. మేయర్ కార్యాలయానికి అధికారులెవర్నీ వెళ్లొద్దని చెప్పారట. తన పర్మిషన్ లేకుండా మేయర్ తో మాట్లాడకూడదని ఆదేశించారట. సహజంగా మేయర్ సమీక్షలు పెట్టి, అధికారుల్ని ఆహ్వానించి సమస్యలు అడిగి తెలుసుకుంటారు.
కానీ ఇక్కడ కమిషనరే సమీక్షలు పెట్టి.. మేయర్ కి ఆహ్వానం పంపిస్తున్నారట. మేయర్ కి ప్రొటోకాల్స్ పై అవగాహన లేకపోవడంతో.. కమిషనర్ ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు సాగుతోందని చెబుతున్నారు.
కార్పొరేషన్లో కానీ, జిల్లా పరిషత్ లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ.. పాలకవర్గం ఎన్నికైన తర్వాత కార్యనిర్వహణ అధికారులు, పాలకవర్గ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. పాలకవర్గం చేసే తీర్మానాలను అమలు పరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా స్థానిక సంస్థల అధిపతులకు, కమిషనర్ కానీ, కార్యనిర్వహణ అధికారి కానీ.. జవాబుదారీగా ఉండాలి. కానీ ఇక్కడ కమిషనర్ ఐఏఎస్ కావడంతో.. మహిళా మేయర్ కి ఇబ్బందులు తప్పడంలేదు.
కార్ల పంచాయితీ..
ఇక మేయర్ కి పాత కారు, కమిషనర్ కి కొత్త కియా కారు అనే వ్యవహారం కూడా నగరంలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలో పర్యటించేందుకు మేయర్ కి ఓ పాత డొక్కు కారుని కేటాయించారు కమిషనర్. అయితే కమిషనర్ మాత్రం కొత్త కియా కారుని తన అధికారిక కార్యక్రమాల కోసం తెప్పించారు.
కారు విషయంలో కూడా గిరిజన మేయర్ కి అవమానం జరిగిందని అంటున్నారు. మేయర్ విషయంలో కమిషనర్ చూపిస్తున్న వివక్ష నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది.