'అన్ని ప్రాంతాల వారికీ న్యాయం జరగాలి.. అందరం ఒక అవగాహనకు రావాలి.. ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి, సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవాలి.. ' అంటూ తన శైలికి భిన్నమైన డైలాగులు, పొడి పొడి మాటలతో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్పందించినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా జరిగిన జనసేన ముఖ్య కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కు రాజధాని మీద నివేదికను అంద చేశారు నాదెండ్ల మనోహర్.
అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభిప్రాయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. మొదట ధూం..ధాం.. అన్నట్టుగా పవన్ స్పందించారు. మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ వరస ట్వీట్లు వేశారు. ఆ తర్వాత పవన్ ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. తమ పార్టీ కమిటీ వేస్తున్నట్టుగా, మంత్రి మండలి నిర్ణయం వరకూ వేచి చూస్తామంటూ ప్రకటించారు.
అంతలోనే పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి స్పందించారు. మూడు రాజధానుల అంశాన్ని చిరంజీవి గట్టిగా సమర్థించారు. దీంతో పవన్ ఎలా స్పందిస్తారనేది సర్వత్రా ఆసక్తిదాయకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ ఇలా సామరస్యం, సర్దుకుపోదాం.. అని అంటున్నారు.
అయితే రేపు పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారట. ఐదేళ్ల కిందట భూ సేకరణ సమయంలో పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లి హల్చల్ చేశారు. అప్పుడు రాజధానికి భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న వారితో పవన్ కలిశారు. ఒక రోజు వారితో సమావేశమై.. వారిచ్చిన పెరుగన్నం తిని.. మళ్లీ వాళ్లను పట్టించుకోలేదు జనసేన అధిపతి. ఇప్పుడు మళ్లీ రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. మరి అక్కడేం మాట్లాడతారో!