ముగ్గురు జర్నలిస్టులను చితకొట్టారు రాజధాని ప్రాంత 'రైతులు'! మొత్తం ఆరు మంది జర్నలిస్టులపై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అది కూడా వారు చేస్తున్న ఆందోళనల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై వాళ్లు దాడికి తెగబడ్డారు. తమకు నచ్చకపోతే జర్నలిస్టులను అక్కడ నుంచి వెనక్కు పంపవచ్చు. అలా దాడికి తెగబడటం ఏమిటో ఆ 'రైతు'లకే తెలియాలి!
ఈ 'రైతుల' దాడిని ఎదుర్కొన్న వారిలో ఒక మహిళా జర్నలిస్టు కూడా ఉంది. మహిళ అని కూడా చూడకుండా కొట్టడం ఏం సంస్కారమో మరి. నాగరికత ఉందంటూ తను అమరావతిని రాజధానిగా ప్రకటించినట్టుగా ఇటీవలే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బహుశా ఇదేనేమో ఆ నాగరికత.
ఇక తమపై దాడికి పాల్పడిన వారిపై సదరు జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు మందిని గుర్తించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. జిల్లా జైలుకు తరలించారు. ఇంకేముంది.. చంద్రబాబుకు మరో ఆయుధం దొరకింది. ఆ 'రైతు'లను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 'రైతులపై అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడతారా?' అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించేశారు.
రాజధాని ఆందోళనలు ఆ ప్రాంతానికే పరిమితం అయిపోయిన నేపథ్యంలో.. దీనిపై మిగతా ప్రాంతాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పందించేందుకు కూడా అవకాశం లేకుండా పోతుండటంతో.. దీన్ని హింసాత్మకంగా మార్చేందుకు ఒక వ్యూహ ప్రకారమే.. జర్నలిస్టులపై దాడి జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని పరామర్శించడానికి స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగడం గమనార్హం.