ఊహల ప్రచారంతో భయపెట్టడం నైతికమేనా?

వామపక్ష పార్టీలు తాము ప్రజల్లోంచి గెలిచినా గెలవకపోయినా ప్రజలపక్షాన మాట్లాడుతూ ఉండడం అనేది కూడా పాతరోజుల నాటి విషయం అయిపోయింది. పాలకపక్షాన్ని వారు విమర్శించడం అనేది .. ప్రజల కోణంలోంచి కాకుండా, విపక్షాల ఎజెండా…

వామపక్ష పార్టీలు తాము ప్రజల్లోంచి గెలిచినా గెలవకపోయినా ప్రజలపక్షాన మాట్లాడుతూ ఉండడం అనేది కూడా పాతరోజుల నాటి విషయం అయిపోయింది. పాలకపక్షాన్ని వారు విమర్శించడం అనేది .. ప్రజల కోణంలోంచి కాకుండా, విపక్షాల ఎజెండా మేరకు ఇప్పుడు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. 

అభూత కల్పనల్ని, ఊహల్ని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి, తద్వారా ప్రభుత్వం మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పడేలా చేయడానికి లెఫ్ట్ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇది స్వయంగా వారు చేస్తున్న కుట్రేనా? లేదా, విపక్షాల కుట్రలో వారు పెయిడ్ కూలీలుగానో.. లేదా, పావులుగానో మారుతున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే ప్రక్రియ జరుగుతోంటే.. దానిని అడ్డుకోవడానికి లెఫ్ట్ పార్టీలు తొలినుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మీటర్ల వలన.. ఉచిత విద్యుత్తు ఎత్తివేయడం జరగదని ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది. రైతుల్లో ఎక్కడా మీటర్లు బిగించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. కానీ, ఎర్రపార్టీలకు మాత్రం చాలా బాధ కలుగుతోంది. ప్రజల్లో లేని వ్యతిరేకతను సృష్టించి- వారి తరఫున తాము పోరాడాలని ఉబలాటపడిపోతున్నారు.

సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అనేది వృథా ఖర్చు అంటున్నారు. ఆయన మాట నిజమే అనుకుందాం. ప్రభుత్వంలో లేని ఆయనకు ఏంటి సమస్య. ప్రభుత్వం ఒక నియంత్రిత విధానం ఉండాలని అనుకున్నప్పుడు, ఉచితంగా ఇచ్చినా సరే.. దానికి ఒక్క లెక్క ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అందుకోసం స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తోంది. దీనిని వృథా అని నిందిస్తున్న రామకృష్ణ.. ఈ వంకతో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా ఎత్తివేస్తారని ఒక భయాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉచిత విద్యుత్తు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగురాష్ట్ర రైతులకు ఇచ్చిన వరం. ఆ క్రెడిట్ పూర్తిగా ఆయనదే. దానిని ఆయన కుమారుడి పార్టీకి కూడా ఆ పథకం ద్వారా రైతుల్లో దక్కే ఆదరణ పెద్ద బలం. ఆ సంగతి పాలకులకు బాగా తెలుసు. 

ఉచిత విద్యుత్తు ఎత్తేస్తే.. రైతుల వ్యతిరేకత ప్రభుత్వాలను పతనం చేయగలదని కూడా వారికి తెలుసు. అలాంటి మరో ముప్పయ్యేళ్లు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్న జగన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు. ఆత్మహత్యా సదృశంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అనే లాజిక్ ను రామకృష్ణ మిస్ అవుతున్నారు. 

నిజానికి వారికి కావాల్సింది కూడా జగన్ ఓటమే. కానీ, అది జరిగేలా లేదు గనుక.. ఊహలతో భయాలను ప్రజల్లోకి ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలని వారు చూస్తున్నట్టుగా ఉంది. విలువలు ప్రవచించే ఈ లెఫ్ట్ పార్టీలకు ఇది నైతికంగా సరైన పనేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.