ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలని ఈడీ పంపిన నోటీసులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తల వంచదని ఆమె స్పష్టం చేయడం విశేషం. మార్చి 9న విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలని ఈడీ నోటీసులు పంపడాన్ని ఆమె నిర్ధారించారు. ఇదే సందర్భంలో తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండడం వల్ల విచారణకు వెళ్లడంపై న్యాయ సలహా తీసుకుంటానని పేర్కొన్నారు.
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు కవిత పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ముందస్తు ధర్నా, అపాయింట్మెంట్ల కారణంగా ఈడీ విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని ఆమె తెలిపారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని ఆమె సున్నిత వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. అలాగే దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతూనే వుంటామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న అధికార కాంక్షపరులకు గుర్తు చేస్తున్నట్టు కవిత చెప్పుకొచ్చారు.