Advertisement

Advertisement


Home > Politics - Opinion

కామెడీ + క‌న్నీళ్లు = బ‌ల‌గం

కామెడీ + క‌న్నీళ్లు = బ‌ల‌గం

క్లోజ‌ప్‌లో చూస్తే జీవితం ట్రాజెడీ.. లాంగ్‌షాట్‌లో చూస్తే కామెడీ - చాప్లిన్‌

న‌వ్వుతూ వుండ‌గా క‌న్నీళ్లు రావాలి. క‌ళ్లు త‌డిగా ఉన్న‌ప్పుడు పెద‌వుల‌పై న‌వ్వు క‌ద‌లాలి. ఇది చాప్లిన్ సినిమాల స్టైల్‌. బాధ‌ల్లో నుంచి పుట్టే హాస్యం చాలా బ‌రువైంది. చాప్లిన్ సినిమాల‌న్నీ అవే. బ‌లగం సినిమాలో దాన్ని ప‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు జ‌బ‌ర్ద‌స్త్ వేణు. ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్‌లో పెద్ద‌గా న‌వ్వించిన‌ట్టు నాకు గుర్తు లేదు. కానీ అది ఆయ‌న కాదు. ఇంకో రూపం వుంది. అదే బ‌ల‌గం సినిమా. బ‌హుశా వేణు విశ్వ‌రూపం.

ఈ సినిమా విడుద‌లై నాలుగైదు రోజులైనా నాకు చూడాల‌నిపించ‌లేదు. ఎందుకంటే వారానికి మూడు నాలుగు చిన్న సినిమాలు వ‌స్తాయి. వాటి కోసం థియేట‌ర్ వ‌ర‌కూ వెళ్లే ఓపిక లేదు. ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలో వ‌స్తాయి. చూస్తూ నిద్ర‌పోవ‌చ్చు. నిద్ర‌పోతూ చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు వాషింగ్ పౌడ‌ర్ యాడ్ లాగా ఉతికి ఆరేస్తాయి. బ‌ల‌గంకి పాజిటివ్ రివ్యూలు వ‌చ్చినా పెద్ద ప‌ట్టించుకోలేదు. 

దిల్‌రాజు సినిమా క‌దా, ఆబ్లిగేష‌న్లు వుంటాయి. అయితే చాలా మంది బాగుంద‌ని చెబుతూ వుంటే  ఏడు కిలోమీట‌ర్లు దూరంలోని ఇనార్బిట్ మాల్‌కి వెళ్లాను. సందేహంగానే థియేట‌ర్‌లోకి అడుగు పెట్టా. త‌ర్వాత నేను థియేట‌ర్‌లో లేను. తెలంగాణ‌లోని ఒక ప‌ల్లెలో రెండు గంట‌ల‌కి పైగా వుండిపోయా. నిజానికి యాస వేరు కానీ, అది మా వూరే.

మ‌ళ‌యాళం వాళ్ల‌పై కొంచెం అసూయ‌, మ‌న ర‌చ‌యిత‌లు, ఫిల్మ్ మేక‌ర్స్‌పై దారుణ‌మైన కోపం నాకు. అక్క‌డ అంత స‌హ‌జ‌మైన క‌థ‌లు, సినిమాలు ఎందుకొస్తాయంటే వాళ్లెవ‌రూ కొచ్చి న‌గ‌రాన్ని ప‌ట్టుకు వేలాడుతూ వుండ‌రు. వాళ్ల ప‌ల్లెల్లో వుంటూ సినిమా టైమ్‌కి అంద‌రూ కొచ్చిలో స‌మావేశం అవుతారు. మ‌న వాళ్లు ఫిల్మ్ న‌గ‌ర్ దాట‌రు. కాలు క‌దిపితే కారు, బయ‌టికి వెళితే విమానం. భూమ్మీద న‌డిచే వాళ్లు ఎలా అర్థ‌మ‌వుతారు?  భూమిలో దాగిన విత్త‌నంలా, క‌ళ కూడా మ‌ట్టిపొర‌ల్లోనే వుంటుంది. రియ‌ల్ ఆర్టిస్ట్ విత్త‌నంలో నుంచి, వృక్షాన్ని ఊహిస్తాడు.

ఒక ప‌ల్లెలో జ‌రిగిన చావు చుట్టూ ఈ క‌థ జ‌రుగుతుంది. క‌న్న‌డ‌లో వ‌చ్చిన తిథి సినిమా దీనికి ప్రేర‌ణ కావ‌చ్చు. ఏదో ఒక ఇన్‌స్పిరేష‌న్ లేకుండా ఆర్ట్ పుట్ట‌దు. సినిమాలో ఎవ‌రూ కూడా న‌టించిన‌ట్టు కాకుండా స‌హ‌జంగా మాట్లాడుతూ వుంటారు. ప్రియ‌ద‌ర్శి ఎంత మంచి న‌టుడంటే, స‌రైన క‌థ‌, క్యారెక్ట‌ర్ ప‌డితే హిందీ న‌సీరుద్దీన్‌షా, ఓంపురిల‌ను కూడా మ‌రిపించ‌గ‌ల‌డు.

మ‌నం కోతి నుంచి మ‌నిషిగా మారి వేల సంవ‌త్స‌రాలైనా మ‌న అడుగున జంతు ప్ర‌వృత్తి అలాగే దాగి వుంది, ముఖ్యంగా భోజ‌నాల ద‌గ్గ‌ర అది బ‌య‌ట‌ప‌డుతుంది. పెద్ద‌పెద్ద ఫంక్ష‌న్లు, పెళ్లిళ్ల‌లో కూడా తొక్కుకుంటారు. ఈ సినిమాలో బావాబామ్మ‌ర్దుల వైరం మాంసం ద‌గ్గ‌ర అని తెలిసిన‌ప్పుడు న‌వ్వొస్తుంది. వేణు సూక్ష్మ ప‌రిశీల‌న‌, సెన్సిటివిటీకి ఇది నిద‌ర్శ‌నం. పేరుపేరునా చెప్ప‌డం సాధ్యం కాదు కానీ, ప్ర‌తి ఒక్క యాక్ట‌ర్ అద్భుతంగా న‌టించారు. థియేట‌ర్ వ‌దిలి వ‌స్తున్న‌ప్పుడు ఏదో వ‌దిలి వ‌చ్చిన‌ట్టు ఫీల్ అయితే అది గొప్ప సినిమా.

వార‌సుడు చూసిన త‌ర్వాత దిల్‌రాజుకి జ‌డ్జిమెంట్ పోయింద‌నిపించింది. పోలేదు, వుంది. కాక‌పోతే అప్పుడ‌ప్పుడు దారి త‌ప్పుతుంది. త‌న బ్యాన‌ర్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా ఇది. దిల్‌రాజు లాంటి పెద్ద నిర్మాత‌లు ఇలాంటి నేటివిటీ క‌థ‌ల్ని ప్రోత్స‌హిస్తే అద్భుతాలు జ‌రుగుతాయి. అయితే విషాదం ఏమంటే ఒక సినిమాతో మెరిపించి ఆశ‌లు క‌ల్పించే వేణు లాంటి ద‌ర్శ‌కులు చాలా మంది రెండో సినిమా, మూడో సినిమాకి అడ్ర‌స్ లేకుండా పోతున్నారు. 

దీనికి కార‌ణం ఒక హిట్ త‌ర్వాత  నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకుంటారు. స‌రైన క‌థ రెడీగా వుండ‌దు. ఆత్మ‌విశ్వాసం లేదా అహంకారం పెరుగుతుంది. చుట్టూ భ‌జ‌న బృందాలు చేరుతాయి. రెండో సినిమా చూసి , మొద‌టి సినిమా తీసింది ఇత‌నేనా అని అనుమానం వ‌స్తుంది. త‌న‌ని తాను తెలుసుకోవ‌డ‌మే బ్ర‌హ్మ జ్ఞానం. భార‌తీయ త‌త్వశాస్త్ర సారం, సారాంశం ఇదే. సినిమానే కాదు, అన్ని రంగాల్లో కూడా త‌మ‌ది కాని పాత్ర‌ల్లోకి ప్ర‌వేశించి మునిగిపోతారు.

ఉప‌నిష‌త్తుల్లో ఒక మాట వుంది. అన్ని ప్రాణుల్లో త‌న‌ని చూసుకునే వాడు, త‌న‌లో అన్ని ప్రాణుల్ని చూసుకునే వాడు గొప్ప‌వాడు. దీన్ని సినిమాకి అన్వ‌యిస్తే అన్ని క‌థ‌ల్లో త‌న‌ని, త‌న‌లో అన్ని క‌థ‌ల్ని చూసుకునే ద‌ర్శ‌కుడు గొప్ప‌వాడు. క‌రోనా త‌ర్వాత సినిమా మారిపోయింది. ఎల్ల‌లు లేవు.

రెండు కోట్ల‌తో తీస్తే రూ.200 కోట్లు కూడా రావ‌చ్చు. ఎంత డ‌బ్బుతో తీసావో, న‌టులెవ‌రో అవ‌స‌రం లేదు. నువ్వు నీ ఆత్మ‌తో క‌థ చెప్ప‌గ‌ల‌గాలి. డ‌బ్బు రావాల‌ని సినిమా తీస్తే రాదు. సినిమా తీయాల‌ని తీస్తే వ‌స్తుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లో ఒక సీన్ వుంటుంది. క‌ళ్లు చెదిరే అపార సంప‌ద‌, కానీ దానికి ఒక డ్రాగ‌న్ కాప‌లా. తెలుగుని దాటి వ‌ర‌ల్డ్ మార్కెట్ మ‌న సినిమా చేరాలంటే ద‌ర్శ‌కుడు ముందు త‌న‌లోని డ్రాగ‌న్‌ని దాటాలి. ప్ర‌తి మ‌నిషికి రెండు ఆప్ష‌న్లు వుంటాయి. చరిత్ర‌లో మిగ‌ల‌డం, ఇంట్లో గోడ‌కి ఫొటోగా మిగిలిపోవ‌డం. ఎవ‌రికి కావాల్సింది వాళ్లు ఎంచుకుంటారు.

మ‌న‌లో చాలా మంది ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాల‌కు వచ్చిన వాళ్ల‌మే. బ‌లగం సినిమా చూసిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది. మ‌నం సంపాయించింది ఎంత‌? పోగొట్టుకున్న‌ది ఎంత‌? జీవితంలోని లాభ‌న‌ష్టాలు అంకెల్లో వుండ‌వు. అనుబంధాల్లో వుంటాయి.

జీఆర్ మ‌హ‌ర్షి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా