తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన అక్కసు వెళ్లగక్కారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల ఉద్దేశ పూర్వకంగానే ఘాటు విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన అన్న వైఎస్ జగన్‌కు కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఆప్తులని తెలిసి కూడా, వారిపై వ్యక్తిగతంగా కూడా ఆమె ఒక్కోసారి ఆరోపణలు చేస్తున్నారు.
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కవితపై షర్మిల విరుచుకుపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షర్మిల మీడియాతో మాట్లాడుతూ కవిత ఆడడై వుండి సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారంటూ ఘాటు విమర్శలతో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ శ్రేణులకి షర్మిల వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించేలా వున్నాయి. పాదయాత్రలో కూడా ఇదే రీతిలో విమర్శలు చేస్తోందనే కారణంతో అనుమతి రద్దు చేసిన సంగతి తెలిసిందే. బహుశా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తే, తనకు ప్రజాదరణ వుంటుందని ఆమె భావిస్తున్నట్టున్నారు.
ఇలాగైనా తన ఉనికిని చాటుకోవచ్చని ఆమె భావిస్తూ వుండొచ్చు. ఎందుకంటే ఊరికే నడుచుకుంటూ వెళితే ఎవరూ పట్టించుకోరని ఆమె పసిగట్టారు. ఇలాగైతే తన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకోలేనని ఆమె వ్యూహాత్మకంగా నోటికి పని చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆమె దూకుడు రాజకీయంగా కలిసొస్తోంది.
పాదయాత్రలో ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగిన సందర్భంలో, సదరు దెబ్బతిన్న వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ కేసీఆర్ ఇంటికి వెళ్లడం స్ఫూర్తినిచ్చింది. మరికొన్ని సందర్భాల్లో షర్మిల విమర్శలు మిస్ ఫైర్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల మగతనం ప్రస్తావన తదితర అంశాలు అనవసరమనే భావన కలిగిస్తున్నాయి.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కవితపై ఓ రేంజ్లో విరుచుకుపడడం అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కేసీఆర్ బిడ్డకే తెలంగాణలో రక్షణ ఉందని ఆమె విమర్శించారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించడం గమనార్హం. మహిళల గౌరవం కోసం కేసీఆర్ బిడ్డ కొట్లాడుతుందట అంటూ వెటకరించారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్‌పై షర్మిల ప్రశ్నించడం మాత్రం ఆకట్టుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్టు కవిత ప్రకటించడంపై ఆమె ఈ రకమైన ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను షర్మిల తెలిపారు. మహిళా దినోత్సవం ఒక్కరోజు మహిళలకు గౌరవం ఇవ్వడం తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. మహిళలని ఓట్లేసే యంత్రాలుగా చూస్తు న్నారని విమర్శించారు. గవర్నర్‌ను అనరాని మాటలన్న వ్యక్తికి బుద్ధి చెప్పాల్సింది పోయి మంచి అవకాశాలు కల్పిస్తారా అని కౌశిక్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకుని షర్మిల ధ్వజమెత్తడం గమనార్హం.
ప్రతి సందర్భంలోనూ కవితను షర్మిల టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల షర్మిల, కవిత మధ్య ట్విటర్ వేదికగా డైలాగ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. షర్మిల విమర్శలపై కవిత స్పందన ఏంటో చూడాలి.