పవన్ ఈరోజు ఏం చెబుతాడో చూడాలి!

ఈరోజు రానే వచ్చింది. అందరి దృష్టి ఇప్పుడు పవన్ కల్యాణ్ పై పడింది. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే పార్టీలన్నీ తమ వైఖరి వెల్లడించిన నేపథ్యంలో.. జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందర్లో ఆసక్తికరంగా…

ఈరోజు రానే వచ్చింది. అందరి దృష్టి ఇప్పుడు పవన్ కల్యాణ్ పై పడింది. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే పార్టీలన్నీ తమ వైఖరి వెల్లడించిన నేపథ్యంలో.. జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందర్లో ఆసక్తికరంగా మారింది. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మరికొద్దిసేపట్లో తన పార్టీ ముఖ్యనేతలతో పవన్ ఈ విషయంపై చర్చించబోతున్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల అంశంపై తన నిర్ణయం వెల్లడిస్తారు.

మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్, అసెంబ్లీలో ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ లో స్పందించారు పవన్. జగన్ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించారు. ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు పెట్టారు. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల దృష్టిలో చులకనయ్యారు. స్వయంగా ఆ ప్రాంతాలకు చెందిన జనసైనికులే పవన్ పై అసంతృప్తి వ్యక్తంచేశారు.

దీంతో తను మౌనం వహించడంతో పాటు పార్టీ శ్రేణులందర్నీ ఈ విషయంలో మౌనంగా ఉండమని ఆదేశించారు పవన్. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఓ కమిటీని వేసినట్టు ప్రకటించిన జనసేనాని.. ఈరోజు అందుబాటులో ఉన్న అందరి నేతలతో ఈ అంశంపై చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు, కార్యదర్శలు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కూడా హాజరవుతారు.

ఈమధ్య నాదెండ్ల, నాగబాబు కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఆ నివేదికపై కూడా ఇవాళ చర్చ జరగనుంది. అయితే ఎంత హంగామా చేసినా చంద్రబాబు ఆదేశాల మేరకు, అతడి అడుగుజాడల్లోనే పవన్ నడిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 3 రాజధానుల అంశంపై పవన్ పూర్తిస్థాయిలో యూ-టర్న్ తీసుకోకపోవచ్చని.. ఎప్పట్లానే తనదైన శైలిలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి, అందరూ అభివృద్ధి చెందాలంటూ చెబుతూనే.. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది.