సినిమావాళ్లపై గతంలో కూడా పలు సెటైర్లు వేశారు కీరవాణి, తాజాగా తన కొడుకు హీరోగా చేసిన మత్తు వదలరా సినిమా ఫంక్షన్ కి హాజరైన ఆయన, మరోసారి హీరోలపై, సక్సెస్ మీట్ల పేరుతో చేస్తున్న హంగామాపై తనదైన రీతిలో చెణుకులు విసిరారు. బాబుగారూ అంటే హీరో అని, సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాపయినట్టేనని అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కీరవాణికి కొత్తేంకాదు. మైక్ దొరికిన ప్రతిసారి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడాయన. బాహుబలి-2 రిలీజ్ టైమ్ లో కీరవాణి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇండస్ట్రీలో ఎక్కువమంది బుర్రలేని వాళ్లతో పనిచేశానని… పరిశ్రమలో గుడ్డి-చెవిటి దర్శకులే ఎక్కువమంది ఉన్నారని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బు కోసమే అలాంటి బుద్ధిలేని దర్శకులతో పనిచేశానని చెప్పుకొచ్చారు కీరవాణి. అలా మేకర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీరవాణి.. ఇప్పుడు సక్సెస్ మీట్లపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
నిజంగా సక్సెస్ మీట్ అనే పదానికి ఇప్పుడు అర్థం మారిపోయింది. సినిమా ఫ్లాప్ అయినా సక్సెస్ మీట్ పేరిట కార్యక్రమం ఏర్పాటుచేసి, ఇంకాస్త ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇందులో తప్పులేదనేది చాలామంది అభిప్రాయం. సేమ్ టైమ్, నిజంగా హిట్ అయిన సినిమాకు కూడా సక్సెస్ మీట్ పెడుతున్నారు. సో.. ఇందులో చెడు కంటే మంచే ఎక్కువ కనిపిస్తోంది. దీన్ని కూడా కామెడీ చేసి పడేశారు కీరవాణి.
కీరవాణి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ కౌంటర్లు పడుతున్నాయి. సొంత సినిమా ఫంక్షన్ కి వచ్చారు కాబట్టి, అది కూడా హిట్ టాక్ వచ్చింది కాబట్టి కీరవాణి రెచ్చిపోయారని… అదే పెద్ద హీరో సినిమా ఫంక్షన్ కు వెళ్లి కీరవాణి ఈ వ్యాఖ్యలు చేయగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాలం కలిసొచ్చి తన కొడుకు సినిమా హిట్టయింది కాబట్టి ఆయన వేదాంతం వల్లిస్తున్నారని… అదే తేడాకొట్టి ఉంటే సక్సెస్ టూర్ల పేరుతో సినిమా యూనిట్ తో కలసి కీరవాణి కూడా పర్యటనలకు చేసేవారని కౌంటర్లు వేస్తున్నారు.