రాష్ట్రంలో వైసీపీకి, బీజేపీ పూర్తి వ్యతిరేకం. సీఎం జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానులపై ఉద్యమానికి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఇక రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు వంటి నిర్ణయాలతో కేంద్ర నాయకత్వంతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు సీఎం జగన్.
ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జగన్ పాలనను ఆకాశానికెత్తేశారు, టీడీపీని విమర్శిస్తూ, జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ ఆసాంతం ఆయన ప్రసంగం వైసీపీ పాలనను మెచ్చుకుంటూనే సాగింది.
తిరుపతిలో హిందూ దేవాలయాల పరిరక్షణ పేరుతో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడారు. టీటీడీ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ పరోక్షంగా రాష్ట్ర బీజేపీ నేతల్ని ఇరుకున పెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు, అవినీతి జరిగిందని, సీఎం జగన్ వీటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావుకి కూడా ఈ మాటలు చెంపపెట్టుగా మారాయి.
ఎన్నికల్లో ఓడిపోయినవారే టీటీడీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని కూడా చీవాట్లు పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి. చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఎంపికను కూడా ఆయన సమర్థించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటై.. మతం విషయంలో జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న వేళ, సుబ్రహ్మణ్య స్వామి వంటి సీనియర్ నేత, అది కూడా దేవాలయాల పరిరక్షణ సదస్సులో జగన్ పాలనను, ఆయన హయాంలో జరుగుతున్న ధర్మ పరిరక్షణను ప్రశంసించడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశమే.
15వేల మంది పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగుల్లో కేవలం 44మంది మాత్రమే క్రిస్టియన్లున్నారని, వారు కూడా రవాణా విభాగంలోనే సేవలందిస్తున్నారని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి. ఒకరకంగా టీటీడీ విషయంలో వైసీపీపై జరుగుతున్న దుష్ప్రచారాలన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. దీంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు పూర్తిగా ఇరుకునపడిపోయాయి.
ఇప్పటి వరకూ టీడీపీ సపోర్ట్ తో జగన్ ని కార్నర్ చేయాలని చూస్తున్న ఏపీ కాషాయదళానికి భారీ షాక్ తగిలినట్టే. ఇకనైనా విమర్శలు మాని, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం వీరికి ఏర్పడింది.