నేచుర‌ల్ స్టార్‌పై ట్రోలింగ్ స్టార్ట్‌!

నేచుర‌ల్ స్టార్ నానిపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. నాని హీరోగా న‌టించిన ‘శ్యామ్‌సింగరాయ్‌’ మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా మీట్‌లో నాని…

నేచుర‌ల్ స్టార్ నానిపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. నాని హీరోగా న‌టించిన ‘శ్యామ్‌సింగరాయ్‌’ మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా మీట్‌లో నాని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్ల‌పై చేసిన కామెంట్స్ రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి. మ‌రోవైపు ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

ముఖ్యంగా థియేట‌ర్ల కంటే ప‌క్క‌నున్న కిరాణా షాపుల క‌లెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంద‌న‌డం, అలాగే త‌న పేరు ముందు నేచుర‌ల్ స్టార్‌ను తీసేద్దామ‌ని అనుకుంటున్న‌ట్టు నాని అన‌డం నెటిజ‌న్ల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. 

టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల‌ను ఏపీ ప్ర‌భుత్వం అవ‌మానించింద‌ని ఆరోపిస్తున్న నానికి …అస‌లు అవ‌మానం అంటే అర్థం తెలుసా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి తాను కిరాణా షాపుల వాళ్ల‌ను అవ‌మానించ‌లేదా? థియేట‌ర్ల యజ‌మానుల‌కే త‌ప్ప మిగిలిన వారెవ‌రికీ ఆదాయం ఉండ‌కూడ‌దా అని ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

నేరుగా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించొచ్చ‌ని, అయితే థియేట‌ర్ల ఆదాయానికి, కిరాణా షాపుల‌కు పోలిక ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో థియేట‌ర్ల య‌జ‌మానులు దోచుకుంటున్న‌ప్పుడు, ప్రేక్ష‌కుల వైపు నుంచి నాని ఎందుకు మాట్లాడ‌లేద‌ని నిల‌దీస్తున్నారు. 'నేచురల్ స్టార్‌' తొల‌గించుకోవ‌డం వ‌ల్ల జ‌నానికి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని హిత‌వు చెబుతున్నారు. 

ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య నాని విమ‌ర్శ‌లు మ‌రింత గ్యాప్ పెంచేలా ఉన్నాయ‌ని, ఇదేదో ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌ట్టు వుంద‌నే అనుమానాలు వ్య‌క్తం చేసేవాళ్లు లేక‌పోలేదు.