“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, కానీ కరెక్ట్ కాదు. సినిమాలు, రాజకీయాలు పక్కనపెట్టేస్తే.. మీరు ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారు. ఓ 10 మందికి ఉద్యోగం ఇచ్చి, పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా షాపు కౌంటర్ ఎక్కువగా ఉంటే అది లాజిక్ అనిపించుకోదు. ప్రేక్షకుల్ని అవమానించడం కరెక్ట్ కాదు.”
ఇదీ హీరో నాని తాజా స్టేట్ మెంట్. సరిగ్గా శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ కు ముందే నాని అనుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతుంది కరెక్టో కాదో.. ప్రభుత్వాలు, కోర్టులు తేల్చుకుంటాయి, సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి. అంతలోనే ఇలా నాని ఈ సబ్జెక్ట్ ని అనవసరంగా పూసుకున్నాడు. సరిగ్గా సినిమా రిలీజ్ ముందు రోజు సున్నం పెట్టుకున్నాడు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం ఆడియన్స్ కి అవమానం అంటూ అర్థంకాని లాజిక్ తీశాడు.
విధాన నిర్ణయాల్లో నాని ఎంట్రీ అవసరమా..?
అప్పటికీ నానికి ఎందుకీ థంబ్ నెయిల్స్ గొడవ అనే అనుమానం వచ్చింది, కానీ నోరు ఆగలేదు. మాట్లాడేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో అనవసర రాద్ధాంతం ఎందుకంటూ తన పరిధి మేరకే స్పందించారు. ప్రభుత్వానికి విన్నపం అని సరిపెట్టారు. కానీ నాని మాత్రం కాస్త పరిధి దాటినట్టే అనిపిస్తోంది. కిరాణా షాపులకు, థియేటర్ కు లింక్ పెట్టి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారంటే.. అసలు కరెక్ట్ ఏంటనేది నానికి తెలుసా..? బెనిఫిట్ షో ల పేరుతో గల్లా పెట్టె నింపుకోవడమే థియేటర్ల ఓనర్ల కౌంటర్ కళకళలాడటమా..? మొదటి మూడు రోజులు అడ్డదిడ్డంగా రేట్లు పెంచేసి అమ్ముకోవడమే వారికి శ్రేయస్కరమా..? అలా రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టే పైరసీ బాధ పెరుగుతోంది. అందుబాటు ధరల్లో టికెట్లు ఉంటే.. ఎవరూ పైరసీని ఆశ్రయించరు. ఫ్రీగా వస్తున్నా చూడరు. మరి ఈ లాజిక్ నానికి ఎప్పుడు అర్థమవుతుందో.
రాజకీయాలు ఎందుకంటూనే రాజకీయ వ్యాఖ్యలు..
పాలిటిక్స్, సినిమాలు అన్నీ పక్కనపెడదామంటూనే నాని.. పాలిటిక్స్ ని కెలికారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది, దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. ఈలోగా హీరో నాని వ్యాఖ్యలు, అందులోనూ సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిర్మాతలకి శ్రేయస్కరమేనా..?
ఎవరో ఏదో చేస్తారని బెదిరిపోవడం కరెక్ట్ కాదు కానీ, సినిమా విడుదల సమయంలో నిర్మాతలకి ఇలాంటి వ్యవహారాలు సవాలక్ష తలనొప్పులు తెచ్చిపెడతాయి. ఇండస్ట్రీలో బ్లాక్ ఎంతో, వైట్ ఎంతో అందరికీ తెలిసినా.. ఎవరి పరిధిలో వారు ఉంటారు, ఒకరి గోతులు ఇంకొకరు తవ్వుకోరు. అంతా బాగున్నప్పుడే ఇలాంటివన్నీ సజావుగా సాగిపోతాయి, ఏమాత్రం తేడాలొచ్చినా ఎంత పెద్ద హీరోలయినా ఎవరూ లెక్కచేయరు. మరి నాని ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. దీనిపై ఆయన వెంటనే సర్దుకుని వివరణ ఇస్తారా..? లేక కౌంటర్లు పడేంత వరకు వెయిట్ చేస్తారా..? వేచి చూడాలి.
నానికి ఏపీ ప్రభుత్వం కౌంటర్
నాని వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం నుంచి కౌంటర్ కూడా వచ్చేసింది. టికెట్ ధరల్ని నియంత్రిస్తే అవమానించడం ఎలా అవుతుందంటూ నానిపై మండిపడ్డారు మంత్రి బొత్స. మేమింతే, ఎంత కావాలంటే అంత వసూలు చేస్తామని హీరోలంటే కుదరదని తేల్చిచెప్పారు.
సినిమా సామాన్యుడికి అందుబాటులో ఉండాలని, దానికోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందని విస్పస్టంగా ప్రకటించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించాలని, అప్పటికీ పరిష్కృతం కాకపోతే ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు.
ఎలా చూసుకున్నా నానికి కష్టమే
నాని ప్రకటనతో రేపు రిలీజ్ కాబోతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు కొత్తగా వచ్చే కష్టమేం లేదు. ఎందుకంటే, ఆల్రెడీ థియేటర్ కష్టాలు మొదలైపోయాయి. కృష్ణాలో కొన్ని థియేటర్లు సీజ్ చేశారు, మరికొన్ని థియేటర్లకు ఫైన్ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిరసిస్తూ.. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 50 థియేటర్లను స్వచ్ఛంధంగా మూసివేశారు.
ఇప్పుడు నాని వ్యాఖ్యలతో అతడి సినిమాపై మరింత ప్రభావం పడేలా ఉంది. రేపు రిలీజ్ అవుతోంది శ్యామ్ సింగరాయ్ సినిమా.