ఏపీలో సినిమా టికెట్ల ధరలు ఇండస్ట్రీలో విభేదాలకు తీసుకొచ్చింది. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ పెత్తనం ఏంటని కొందరు సినీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రేక్షకుల జేబులు చిల్లులు పడకుండా ప్రభుత్వం నియంత్రిస్తోందని పాలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరలకు టీ కూడా రావడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నేచురల్ స్టార్ నాని ఘాటు విమర్శలు చేశారు.
థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తానేం మాట్లాడినా వివాదం అవుతుందని, కానీ టికెట్ ఎంత ధర ఉన్నా కొనడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలు, కలెక్షన్స్, షేర్స్ గురించి సరైన అవగాహన లేకుండా నాని వ్యాఖ్యానించడం సబబుగా లేదని నిర్మాత నట్టికుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాని విమర్శలపై నిర్మాత నట్టి కుమార్ స్పందన ఏంటో ఆయన మాటల్లోనే…
‘సినిమా టికెట్ల ధరలపై మేము ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఏపీలో ఉన్న టికెట్ రేట్లు, షేర్స్, కలెక్షన్స్ గురించి తెలుసుకోకుండా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఆయన వ్యాఖ్యల వల్ల మిగిలిన సినిమాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆయన ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వాన్ని అవమాన పరిచేలా మాట్లాడకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాని విమర్శలు చేయడం సరికాదు. ఇప్పుడున్న రేట్లతో ఆయన సినిమాకు ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని నా అభిప్రాయం’ అని నట్టి కుమార్ అన్నారు.
నాని విమర్శలపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. నాని వ్యాఖ్యలను మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు పడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని హితవు చెబుతున్నారు. మరోవైపు నానికి మద్దతు పలికితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని మరికొందరు సినీ పెద్దలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.