జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తిచ్చే వాళ్ల‌నూ క‌ల‌వ‌నివ్వ‌రా?

ప‌రిపాల‌న, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు ముందుకొచ్చిన రాయ‌ల‌సీమ ప్ర‌జాసంఘాల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌ని దుస్థితి. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్…

ప‌రిపాల‌న, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు ముందుకొచ్చిన రాయ‌ల‌సీమ ప్ర‌జాసంఘాల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌ని దుస్థితి. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ హ‌క్కుల సాధ‌న కోసం సీరియ‌స్‌గా ప‌ని చేస్తున్న కొన్ని ప్ర‌జాసంఘాలు సీఎంను క‌లిసి వినతిప‌త్రం ఇచ్చేందుకు నిర్ణ‌యించాయి.

ఈ సంద‌ర్భంగా చారిత్ర‌క శ్రీ‌బాగ్ ఒప్పందాన్ని గౌర‌వించి, అందుకు త‌గ్గ‌ట్టు రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందించ‌డంతో పాటు మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లేందుకు ప్ర‌జాసంఘాలు నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ఓ విన‌తిప‌త్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నాయి. సీఎంతో అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కూడా స‌మ్మ‌తించారు.

ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా రాయ‌ల‌సీమ ప్ర‌జాసంఘాల నాయ‌కుల‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. రాయ‌ల‌సీమ విష‌యంలో ప్ర‌భుత్వ విధానాల‌ను తాము స్వాగ‌తిస్తున్నామ‌ని, అంతేకాకుండా సీఎంను అభినందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెబుతున్నా వినిపించుకోలేద‌ని రాయ‌ల‌సీమ ప్ర‌జాసంఘాల నేత‌లు వాపోతున్నారు. అచ్చం చంద్ర‌బాబు పాల‌న‌ను మ‌రిపించేలా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఎంకు స‌మ‌ర్పించాల్సిన విన‌తిప‌త్రాన్ని మీడియాకు విడుద‌ల చేశారు.

రాయ‌ల‌సీమ విద్యావంతుల వేదిక‌, రాయ‌ల‌సీమ విద్యార్థి వేదిక‌, రాయ‌ల‌సీమ ప్ర‌జాసంఘాల స‌మ‌న్వ‌య వేదిక‌, రాయ‌ల‌సీమ మ‌హిళా శ‌క్తి, రాయ‌ల‌సీమ విద్యార్థి శ‌క్తి పేర్ల‌తో త‌యారు చేసిన స‌ద‌రు విన‌తిప‌త్రంలోని  ముఖ్య‌మైన అంశాల గురించి తెలుసుకుందాం.

‘పాల‌న, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌న్యవాదాలు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, చారిత్రక శ్రీ‌బాగ్ ఒప్పందం వూసే ఎత్త‌కుండా, చ‌ట్ట‌బద్ధంగా నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిష‌న‌ర్ నివేదిక‌ను ప‌క్క‌న పడేసి, ఏక‌ప‌క్షంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది. 

న‌వ్యాంధ్ర పేరుతో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు వంచ‌న‌కు గురి చేశారు. రాయ‌ల‌సీమ ఉద్య‌మ చైత‌న్యంతో ప్ర‌జ‌లు 2019లో టీడీపీకి రాయ‌ల‌సీమ‌లో దాదాపు ఉనికే లేకుండా చేశారు. 70 ఏళ్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఇంత వ‌ర‌కూ శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక గురించి ఒక్క మాట కూడా ఏ ముఖ్య‌మంత్రి, ఏ రాజ‌కీయ పార్టీలు కూడా మాట్లాడ్డానికి , త‌మ స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ప్ర‌క‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ లేదు, సాహసించ‌లేదు.

ఈ త‌రుణంలో శాస‌న‌స‌భ‌లో శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక‌పై సుదీర్ఘ‌మైన చ‌ర్చ పెట్టి రాయ‌ల‌సీమ అస్తిత్వాన్ని, గౌర‌వాన్ని పెంచారు. అంతే కాకుండా శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక‌కు క‌ట్టుబ‌డి ఆ ఒప్పందంలో భాగంగానే క‌ర్నూల్‌లో హైకోర్టు, లోకాయుక్త‌, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాల‌తో పాటు న్యాయ‌ప‌ర‌మైన ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందుకు రాయ‌ల‌సీమ త‌ర‌పున హృద‌య‌ పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాల‌నే మీ చిత్తశుద్ధిపై మాకు విశ్వాసం ఉంది. ఈ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప‌క్షాన మ‌రిన్ని న్యాయ‌మైన, స‌హ‌జ‌మైన మ‌రికొన్ని డిమాండ్ల‌ను మీ దృష్టికి తీసుకొస్తున్నాం.

రాయ‌ల‌సీమ‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలి, ప్ర‌భుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్మెంట్ బోర్డును విశాఖ‌కు కాకుండా క‌ర్నూల్‌కు త‌ర‌లించాలి. హంద్రీ-నీవా ,తెలుగు గంగ‌, గాలేరు-న‌గ‌రి, వెలిగొండ‌, ముచ్చుమ‌ర్రి, గురు రాఘ‌వేంద్ర‌, సిద్ధాపురం ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను అనుమ‌తించిన ప్రాజెక్టులుగా కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు నోటిఫికేష‌న్ల‌లో స‌వ‌రణ చేయాలి. రాయ‌ల‌సీమ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి. అలాగే 50 వేల కోట్ల‌తో వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీని కేంద్ర ప్ర‌భుత్వం వ‌చ్చే బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ పెట్టేలా రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేయాలి’ అని రాసుకొచ్చారు. 

జ‌గ‌న్‌కు ప్ర‌యోజ‌నం కల‌గ‌కుండా అడ్డుకునే శ‌క్తుల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు దృష్టి సారించాల్సిన అవ‌స‌రాన్ని ఈ ఎపిసోడ్ గుర్తు చేస్తోంది.