తెలంగాణ‌లో ఒమిక్రాన్ ఆంక్ష‌లు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సంకేతాలు స్ప‌ష్టంగా వెల్ల‌డ‌వుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్ర‌పంచాన్ని మ‌రోసారి గ‌డ‌గ‌డ‌లాడించేందుకు త‌రుముకొస్తోంది. బ్రిట‌న్‌లో పంజా విసురుతోంది. మ‌న దేశంలో కూడా రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య…

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తున్న సంకేతాలు స్ప‌ష్టంగా వెల్ల‌డ‌వుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్ర‌పంచాన్ని మ‌రోసారి గ‌డ‌గ‌డ‌లాడించేందుకు త‌రుముకొస్తోంది. బ్రిట‌న్‌లో పంజా విసురుతోంది. మ‌న దేశంలో కూడా రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల‌తో పాటు ఇతర పండుగల‌ను పుర‌స్క‌రించుకుని జనం గుంపులుగా చేర‌కుండా త‌గిన ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కేసీఆర్ స‌ర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు రెండు, మూడు రోజుల స‌మ‌యాన్ని ప్ర‌భుత్వానికి న్యాయ‌స్థానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.  

తెలంగాణలో కోవిడ్, ఓమిక్రాన్‌పై ఆ రాష్ట్ర‌ హైకోర్టు గురువారం చేప‌ట్టిన విచార‌ణ‌లో భాగంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఇప్ప‌టికే ఒమిక్రాన్ క‌ట్ట‌డికి ప‌లు రాష్ట్రాలు చేప‌ట్టిన ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను హైకోర్టు ప్ర‌స్తావించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరే ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించ‌డం విశేషం. 

ఎయిర్ పోర్ట్ లో మాదిరిగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్ర‌జ‌ల‌కు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.