‘మహా’ ట్రోలింగ్.. రంగంలోకి దిగిన కన్నడ మీడియా

కేజీఎఫ్ సినిమాపై తెలుగు దర్శకుడు వెంకటేశ్ మహా చేసిన 'నీచ్ కమీనే కుత్తే' కామెంట్స్ వైరల్ అయి, చేరాల్సిన చోటుకే చేరాయి. వెంకటేశ్ మహా వివాదాస్పద వ్యాఖ్యలపై శాండిల్ వుడ్ భగ్గుమంటోంది, కేజీఎఫ్ అభిమాలు,…

కేజీఎఫ్ సినిమాపై తెలుగు దర్శకుడు వెంకటేశ్ మహా చేసిన 'నీచ్ కమీనే కుత్తే' కామెంట్స్ వైరల్ అయి, చేరాల్సిన చోటుకే చేరాయి. వెంకటేశ్ మహా వివాదాస్పద వ్యాఖ్యలపై శాండిల్ వుడ్ భగ్గుమంటోంది, కేజీఎఫ్ అభిమాలు, యష్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

ఛానెళ్లు, సోషల్ మీడియాలో నిరసనల సెగ

నిన్నటివరకు తెలుగు మీడియాకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు కన్నడనాట వ్యాపించింది. కన్నడ న్యూస్ ఛానెల్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. కన్నడ సినిమాలంటే టాలీవుడ్ దర్శకులకు చిన్నచూపు అనే విధంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.

అటు సోషల్ మీడియాలో కన్నడ అభిమానులు ఫుల్ గా రెచ్చిపోతున్నారు. కొంతమంది వెంకటేష్ మహా ఫొటోలకు దండలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తుంటే, ఇంకొంతమంది ఏకంగా సమాధులు కట్టి తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఇకపై కన్నడ దర్శకులు ఎవ్వరూ తెలుగులో సినిమాలు చేయకూడదని కొందరు కన్నడ ఫ్యాన్స్ వాదిస్తుంటే, తెలుగు సినిమాల్ని కన్నడనాట అడ్డుకోవాలంటూ మరికొందరు కొత్త డిమాండ్ అందుకున్నారు. ఇవన్నీ జరిగేవి కాదు కానీ, ఒక చిన్న దర్శకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ స్థాయికి చేరుకోవడం బాధాకరం.

అగ్నికి ఆజ్యం పోస్తున్న ప్రభాస్-ఎన్టీఆర్ ఫ్యాన్స్

యష్ ఫ్యాన్స్, కేజీఎఫ్ అభిమానులతో ప్రభాస్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కలిసిపోయారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు. కేజీఎఫ్ లో రాకీ భాయ్ పాత్రను వెంకటేష్ మహా అవమానించాడు. సో.. పరోక్షంగా నీల్ రైటింగ్ ను అతడు కించపరిచినట్టే. అందుకే ఈ ట్రోలింగ్ లో ప్రభాస్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారు.

సగం క్షమాపణ చెప్పిన వెంకటేశ్

తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై వెంకటేశ్ మహా స్పందించాడు. కేజీఎఫ్ సినిమాపై తను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం లేదని స్పష్టం చేశాడు మహా. అది కేవలం తన ఉద్దేశం మాత్రమే కాదని, చాలామంది అభిప్రాయాన్ని తను వెల్లడించానని అన్నాడు. అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో వాడిన భాష మాత్రం అభ్యంతరకరంగా ఉందని, అందుకు తను క్షమాపణలు కోరుకుంటున్నట్టు వీడియో రిలీజ్ చేశాడు.

ఈ సందర్భంగా మరో వీడియో కూడా రిలీజ్ చేశాడు మహా. తనకు ట్రోలింగ్ కొత్త కాదని, ఎంత ట్రోలింగ్ అయినా భరిస్తానని, కానీ తన కారణంగా తోటి దర్శకులు ట్రోలింగ్ కు గురవుతున్నారని, ఆ విషయంలో బాధగా ఉందన్నాడు. వాళ్లు తెలుగు పరిశ్రమలో ఎంతో గౌరవనీయమైన దర్శకులని, వాళ్లను ట్రోల్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. వెంకటేశ్ మహా కేజీఎఫ్ లో రాకీ పాత్రను ఎద్దేవా చేస్తుంటే ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయ పడిపడి నవ్విన సంగతి తెలిసిందే.

మొత్తమ్మీద ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మీడియాలో కూడా హెడ్ లైన్స్ గా మారుతోంది ఈ టాపిక్. రాబోయే రోజుల్లో ఇది ఏ మలుపు తీసుకుంటుందో!