లోకేశ్ ప‌ప్పు క‌దా…మ‌రెందుకు అడ్డుకుంటున్నారు?

సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ‌ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చారు. సీపీఐ నాయ‌కులు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ ఎప్పుడు మాట్లాడినా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఎక్కువ‌గా త‌పిస్తుంటారు. అందుకే వాళ్లిద్ద‌రూ చంద్ర‌బాబు…

సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ‌ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చారు. సీపీఐ నాయ‌కులు నారాయ‌ణ‌, రామ‌కృష్ణ ఎప్పుడు మాట్లాడినా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఎక్కువ‌గా త‌పిస్తుంటారు. అందుకే వాళ్లిద్ద‌రూ చంద్ర‌బాబు ప్ర‌తినిధులుగా పేరు తెచ్చుకున్నారు. తిరుప‌తిలో ఇవాళ కె.నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు.

లోకేశ్‌పై త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు. విశాఖ‌లో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ నిర్వ‌హించి భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌నడంలో వాస్త‌వం లేద‌న్నారు. సీఎం జ‌గ‌న్‌ను పారిశ్రామిక‌వేత్త‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి ఎంత మాత్రం లేద‌న్నారు. ఎందుకంటే ఆల్రెడీ విశాఖ నుంచి ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌ను, అలాగే చిత్తూరు జిల్లాలో అమ‌ర్‌రాజా ప‌రిశ్ర‌మ‌ను త‌రిమేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌దే అన్నారు.

పరిశ్రమల కోసం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు కాకి లెక్కలేనని ఆయ‌న తేల్చి చెప్పారు. రూ.34 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌ర‌న్నారు. మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించిన వెంట‌నే వేల కోట్ల వ్యాపారం అమెరికాకు పోయింద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై ఇదే ప్ర‌య‌త్నం రెండు మూడేళ్ల క్రితం చేసి వుంటే న‌మ్మేవాళ్ల‌మ‌న్నారు. విశాఖ పెట్టు బడుల సదస్సు అంతా నాటకమేనని ఆయ‌న ఆరోపించారు.

ఒంట‌రిగా పోటీ చేయాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేయ‌డంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒంట‌రిగా పోటీ చేయాలా? లేక జంట‌గా పోటీ చేయాలా? అనే విష‌య‌మై నిర్ణ‌యించ‌డానికి నువ్వెవ‌రిని నారాయణ ప్ర‌శ్నించారు. యుద్ధంలో గెలుపొంద‌డానికి ఏమైనా చేస్తార‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ఎవ‌రైతే జ‌గ‌న్‌కు, మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడితే, వాళ్లంతా ద్రోహుల కింద లెక్క అన్నారు. జ‌గ‌న్ బ్లాక్ మెయిల్‌కు ఎవ‌రూ లొంగ‌ర‌న్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నారన్నారు. లోకేశ్‌ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయ‌ణ నిల‌దీశారు. జ‌గ‌న్ దృష్టిలో లోకేశ్ అనే నాయ‌కుడు ప‌ప్పు అన్నారు. మ‌రి అలాంటి లోకేశ్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌ప్పును చూసి కూడా భ‌య‌ప‌డుతున్నారా? అని నిల‌దీశారు. చంద్ర‌బాబు ముస‌లాడ‌య్యాడంటున్నార‌ని, మ‌రి ఆయ‌న్ను ఎందుకు ఆపుతున్నార‌ని ప్ర‌శ్నించారు.