క‌విత‌పై వేలాడుతున్న అరెస్ట్ క‌త్తి!

ఎమ్మెల్సీ క‌విత‌పై అరెస్ట్ క‌త్తి వేలాడుతోంది. తాజాగా క‌వితకు బాగా తెలిసిన వ్య‌క్తిగా ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అరుణ్ పిళ్లైని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.…

ఎమ్మెల్సీ క‌విత‌పై అరెస్ట్ క‌త్తి వేలాడుతోంది. తాజాగా క‌వితకు బాగా తెలిసిన వ్య‌క్తిగా ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అరుణ్ పిళ్లైని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 11 మందిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొన్ని అరెస్ట్‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టి క‌విత‌పై ప‌డింది. ఇదిలా వుండ‌గా ఇదే కేసులో ఈ నెల 2న అరెస్ట్ అయిన వ్యాపార‌వేత్త అమ‌న్‌దీప్ ధాల్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు అరుణ్‌ను అరెస్ట్ చేశార‌ని తెలిసింది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ విడుద‌ల‌కు ముందే అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ ధాల్ వ‌ద్ద ల‌భించింది. సౌత్ గ్రూప్ స‌భ్యుల‌తో స‌మావేశానికి ధాల్ చొర‌వ చూపిన‌ట్టు ఈడీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సౌత్ గ్రూప్ స‌భ్యులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత‌, విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డి, బోయ‌న‌ప‌ల్లి అభిషేక్ త‌దిత‌రుల‌ను ఈడీ, సీబీఐ గుర్తించింది. ఇప్ప‌టికే మాగుంట రాఘ‌వ‌రెడ్డి, శ‌ర‌త్‌చంద్రారెడ్డిల‌ను అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన ముఖ్య నేత‌ల్లో క‌విత ఉన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ కంపెనీల్లో 65 శాతం వాటా క‌లిగి ఉన్నార‌ని క‌విత‌పై ఇప్ప‌టికే ఈడీ అభియోగం మోపింది. 

ఆ మేర‌కు చార్జిషీట్ కూడా దాఖ‌లు చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో క‌విత‌ను ఆమె నివాసంలోనే సీబీఐ ప్ర‌శ్నించింది. అనంత‌ర కాలంలో క‌విత అరెస్ట్ త‌ప్ప‌దంటూ ప‌దేప‌దే బీజేపీ నేత‌లు చెబుతున్నారు. తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తే, రానున్న కాలంలో కీల‌క అరెస్ట్ త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.