శోభానాయుడు.. సంప్రదాయ కూచిపూడి నృత్యానికి అచ్చమైన చిరునామాగా నిలిచారు. ఆమె విశాఖ ఆడపడుచు. అనకాపల్లిలో పుట్టి ఆనక వెంపటి చినసత్యం వద్ద శిష్యరికంతో గజ్జె కట్టి ఖండాంతరాలకు ఆ కీర్తిని వ్యాపింపచేసిన విదూషీమణి. విశాఖలో ఆమె ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారో చెప్పనలవికాదు.
ఆమెకు విశాఖలో ఎందరో శిష్యులు ఉన్నారు. అభిమానులు ఉన్నారు. సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఆమెను అభిమానులు విశాఖ పురవీధులలో గుర్రపు రధంపై ఊరేగించి వేదిక వద్దకు తీసుకురావడం ఒక మధురానుభూతి.
ఆమె విశాఖలో నాట్యంపై నిర్వహించిన అనేక సదస్సులకు హాజరయ్యారు. ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లో వేలమందిని విద్యార్ధులుగా చేర్చుకుని వారిని ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత కూడా ఆమెదే.
విశాఖ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆమె ఎపుడూ ఆనందం వ్యక్తం చేసేవారు. పద్మశ్రీ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె కరోనాతో కన్నుమూయడం పట్ల సాంస్కృతిక రాజధాని విశాఖ విషాదంలో మునిగిపోయింది.
సినిమాల్లో అవకాశాలు వచ్చినా మేటి దర్శకులు ఆమెను అడిగినా కూడా సున్నితంగా తిరస్కరించి కూచిపూడి కళకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె లేరన్న లోటు ఎప్పటికీ తీరదు అంటున్నారు కళాభిమానులు.