మొన్నటివరకు నిర్మాత.. అంతలోనే దర్శకుడిగా కార్డు

డెవిల్ సినిమా మేటర్ ఇది.. సరిగ్గా 2 నెలల కిందటి సంగతి.. దర్శకుడిగా నవీన్ మేడారం పేరు పడింది. అయితే దానికి పైన దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ కార్డ్ పడింది. అక్కడ అభిషేక్…

డెవిల్ సినిమా మేటర్ ఇది.. సరిగ్గా 2 నెలల కిందటి సంగతి.. దర్శకుడిగా నవీన్ మేడారం పేరు పడింది. అయితే దానికి పైన దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ కార్డ్ పడింది. అక్కడ అభిషేక్ పిక్చర్స్ అని రాసుకున్నారు. అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. సరే.. పెద్ద సినిమా కాబట్టి ఆమాత్రం ముందు జాగ్రత్త అవసరం అనుకున్నారంతా.

కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా దర్శకుడి కార్డు మాయమైంది. దాని పైన ఉన్న 'పర్యవేక్షణ' కూడా పోయింది. ఏకంగా దర్శకుడిగా అభిషేక్ నామా పేరు ప్రత్యక్షమైంది. అవును.. డెవిల్ సినిమాకు ఇప్పుడు అభిషేక్ నామా ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దర్శకుడు కూడా. తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఎక్కడా నవీన్ మేడారం పేరు కనిపించలేదు.

సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా, డెవిల్ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే ఆమె ఫస్ట్ లుక్ కంటే, దర్శకుడు-నిర్మాతగా అభిషేక్ నామా అనే టైటిల్ కార్డు చాలామందిని ఆకర్షించింది.

ఈ సినిమాకు కథారచయిత శ్రీకాంత్ విస్సా, దర్శకుడు నవీన్ మేడారం కలిసి వర్క్ చేశారు. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరక్షన్ అనే తేడా లేకుండా ఇద్దరూ కలిసి పనిచేశారు. సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ “స్క్రీన్ ప్లే-దర్శకుడు” అనే కార్డుకు ఫిక్స్ అయ్యాడు నవీన్ మేడారం.

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అభిషేక్ పిక్చర్స్ ను దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ కార్డు కింద వేశారు. రోజులు గడిచేకొద్దీ నవీన్ కు చెందిన టైటిల్ కార్డు నుంచి “స్క్రీన్ ప్లే” మాయమైంది. కేవలం దర్శకుడిగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అది కూడా పోయింది.

ప్రస్తుతం డెవిల్ సినిమాకు, నవీన్ మేడారంకు సంబంధం లేనట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మాత అభిషేక్ నామా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే డైరక్టర్ ఎందుకు తప్పుకున్నాడు..? అతడే స్వయంగా తప్పుకున్నాడా లేక ప్రొడ్యూసర్ తప్పించాడా? ఇందులో హీరో ప్రమేయం ఎంత? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాల్లేవ్.