ఎప్పటికప్పుడు తాను ఏపాటి మేధావినో బైటపెట్టుకునేందుకు నారా లోకేష్ శత విధాల ప్రయత్నించి విఫలం అవుతుంటారు. ఆమధ్య సీఎం జగన్ మాస్క్ లేకుండా బైటకెందుకు వెళ్తున్నారంటూ ట్వీట్ చేసి ఏదో స్కామ్ ని వెలికితీసినట్టు బిల్డప్ ఇచ్చారు లోకేష్.
ఇప్పుడు వర్షాలు, వరదలకు జగన్ బైటకు ఎందుకు రావడం లేదంటూ లాజిక్ తీశారు. వరదలు, బురదలు అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ జగన్ ని ప్రశ్నించారు లోకేష్.
3648 కిలోమీటర్ల దూరం కేవలం కాలినడకన పాదయాత్ర చేసిన జగన్ గురించేనా లోకేష్ ఈ ప్రశ్న వేసింది. పాదయాత్రలో భాగంగా రోడ్డుపై నడిచారు, వర్షంలో తడిచారు, బురదలో అడుగేశారు, వరిచేలో దిగారు జగన్. అలాంటి జగన్ ని లోకేష్ ఇలా ప్రశ్నించడం వింత, విడ్డూరం రెండూనూ.
కరోనా కష్టకాలంలో వైసీపీ నాయకులు బైటకెళ్లి సేవ చేస్తుంటే.. అలా ఎలా వెళ్తారంటూ తిట్టింది లోకేష్ కాదా? లాక్ డౌన్ టైమ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కున్న విషయం నిజం కాదా? అప్పుడు ఏపీ ప్రజలు ఎక్కడికిపోయారనుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల్లో తిరిగింది ముమ్మాటికీ వైసీపీ నాయకులే.
అప్పుడు, ఇప్పుడు ఏపీని పూర్తిగా గాలికొదిలేసి ఆన్ లైన్ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు-లోకేష్. ఢిల్లీ వెళ్లడానికి తీరిక దొరికిన జగన్.. వరద ప్రాంతాల్లో ఎందుకు తిరగడంలేదని ట్విట్టర్ లో ప్రశ్నించారు లోకేష్. ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా జగన్ మనసులో ఎప్పుడూ ప్రజలే ఉంటారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారు, అవసరం అనుకుంటే.. కచ్చితంగా గల్లీలో కూడా పర్యటిస్తారు.
విశాఖ గ్యాస్ దుర్ఘటన తర్వాత హుటాహుటిన అక్కడకు వెళ్లి ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిది జగన్ కాదా. నష్టపరిహారం ప్రకటించిన 2 రోజుల్లోనే వారి చేతులో చెక్కులు పెట్టిన ఘనత వైసీపీది కాదా.
అమరావతి రైతుల మరణాలనే కాదు.. చివరకు ప్రకృతి విపత్తుల్ని కూడా నీఛ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారు టీడీపీ నాయకులు. రైతుబిడ్డ చీవాట్లు పెట్టిన రెండు రోజులైనా కాలేదు.. మళ్లీ ట్విట్టర్లో చినబాబు హడావిడి ఎక్కువైంది. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నా, సోషల్ మీడియాలో ఎంతమంది తిడుతున్నా.. తన దిగజారుడు రాజకీయాల్ని మాత్రం లోకేష్ వదలడం లేదు.