సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు హైకోర్టు న్యాయమూర్తులపై పలు ఆరోపణలు చేస్తూ, అందుకు తగ్గ ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. న్యాయ వ్యవస్థను ఓ కుదుపు కుదుపుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ సదరు ఫిర్యాదు లేఖను బహిరంగ పరచడంపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను బహిరంగపరచడం కోర్టు ధిక్కరణ కింద వస్తుందని కొందరు, అలా ఏమీ కాదని మరికొందరు తమతమ అభిప్రాయాలను, వాదనలను బలంగా వినిపిస్తున్నారు.
ఇదే అంశంపై ఇండియా టుడే చానల్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోర్టుల్లో అవినీతిపై మరో సారి తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సీజేఐకి లేఖ రాసి మంచి పని చేశారని అన్నారు. అలాగే ఆ లేఖను బహిరంగ పరిచి మరింత మంచి పని చేశారని ప్రశంసలతో ముంచెత్తారు.
ఒకవేళ బహిరంగం చేయకపోతే వాళ్లు విచారణ చేయరని కొత్త లాజిక్‌ను ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ వ్యవహారం ప్రజల్లోకి వచ్చింది కాబట్టి తప్పని సరిగా విచారణ చేయాల్సి వచ్చిందని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, విచారణ కోసం అందరూ పట్టుబట్టాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీఎం జగన్ రాసిన లేఖపై అత్యంత నిజాయితీపరులైన ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో విచారణ కమిటీ వేయాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేయడం విశేషం. మొత్తానికి ప్రశాంత్ భూషణ్ ఆంధ్రప్రదేశ్, న్యాయ వ్యవస్థ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై ఏ మాత్రం తగ్గట్లేదు. చివరికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరగనుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.