ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పాన్ ఇండియా కష్టాలు

భీమ్లానాయక్ ను తప్పించారు కాబట్టి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు ఇక బాక్సాఫీస్ రన్ సులభం అనుకోవడానికి వీల్లేదు. అటు రాధేశ్యామ్ పరిస్థితి కూడా ఇదే. థియేటర్లలో పోటీ లేకపోయినా, ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు ఈ…

భీమ్లానాయక్ ను తప్పించారు కాబట్టి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు ఇక బాక్సాఫీస్ రన్ సులభం అనుకోవడానికి వీల్లేదు. అటు రాధేశ్యామ్ పరిస్థితి కూడా ఇదే. థియేటర్లలో పోటీ లేకపోయినా, ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు ఈ రెండు సినిమాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

లాక్ డౌన్ భయాలు..

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాలకు విస్తరించాయి. ఇప్పటికే బెంగళూరులో ఆంక్షలు విధిస్తూ ప్రకటనలు చేశారు. డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలున్నాయి. ఆ తర్వాత కూడా కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ భయాలు కూడా మొదలయ్యాయి. 

దేశవ్యాప్తంగా ఇంకోసారి లాక్ డౌన్ పెడతారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈరోజు నిర్వహించనున్న సమీక్షలో ప్రధాని దీనిపైనే చర్చిస్తారని అంటున్నారు. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలకు కష్టాలు తప్పవు.

ఉత్తరాదిన ఆక్యుపెన్సీ కష్టాలు..

ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచారు కానీ ఆక్యుపెన్సీ నిబంధనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రేపోమాపో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనను ఎత్తేస్తారని అనుకుంటున్న టైమ్ లో ఒమిక్రాన్ విజృంభన మొదలైంది. దీంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో 50శాతం ఆక్యుపెన్సీతోనే నడిచే పరిస్థితి ఉంది.

ఓవర్సీస్ లో పరిస్థితి ఏంటి..

అమెరికా మరోసారి మెల్లగా లాక్ డౌన్ లోకి జారుకుంటుందేమో అనిపిస్తోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం వారం రోజుల వ్యవథిలోనే 73 శాతం ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో మాస్కును కంపల్సరీ చేశారు. ప్రస్తుతానికి ఆంక్షలు విధించనప్పటికీ.. రాబోయే రోజుల్లో థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లోకి వచ్చేలా ఉంది. 

ఇక బ్రిటన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజుకు సగటున 60వేల కేసులు నమోదవుతున్నాయి. నెదర్లాండ్స్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, నార్వే లాంటి దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలపై ప్రభావం చూపించడం గ్యారెంటీ.

ఏపీ, తెలంగాణలో భిన్న పరిస్థితులు..

ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ వ్యవస్థలో పరిస్థితులు ఇప్పటివరకు చూడని విధంగా  ఉన్నాయి. టికెట్ రేట్ల లొల్లి ఇంకా కొలిక్కి రాలేదు. దీనికితోడు అధికారులు జరుపుతున్న దాడులతో థియేటర్లు వరుసగా మూతపడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో పలు థియేటర్లు మూతపడగా.. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించడానికి సిద్ధమౌతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగ్జిబిటర్లంతా ఏకమౌతున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల టైమ్ కు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఇటు తెలంగాణలో పరిస్థితి మొత్తం అనుకూలంగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరో వారం రోజుల్లో పరిస్థితి అదుపులోకి రాకపోతే కచ్చితంగా ఆ ప్రభావం థియేట్రికల్ వ్యవస్థపై పడుతుందంటున్నారు అధికారులు. కనీసం 50శాతం ఆక్యుపెన్సీ అయినా విధించే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.

ఓవైపు ఈ భయాలు ఇలా ఉన్నప్పటికీ, మరోవైపు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమా యూనిట్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరుకోగా.. ఇవాళ్టి నుంచి రాధేశ్యామ్ మేనియా షురూ కాబోతోంది.