రాజధాని విశాఖపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు మనసు పారేసుకున్నారు. అనూహ్యంగా ప్రభుత్వం విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఆయా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామం గోదావరి జిల్లాల ప్రజల్లో మరింత ఉత్కంఠ కలిగిస్తోంది.
విశాఖ-తూర్పు గోదావరి జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుండి విశాఖ జిల్లాకు సైతం దూరాభారం అనే సమస్య లేదు! ఈ జిల్లా నుండి కేవలం రెండు, మూడు గంటల్లో రైలు లేక రోడ్డు మార్గంలో విశాఖ జిల్లా చేరుకునే అవకాశం ఉంది.
విశాఖ ఉన్న ప్రాధాన్యతను ముందు గుర్తించిన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు దశాబ్దాల క్రిందటే వలస వెళ్ళారు. ప్రధానంగా సంపన్న, పారిశ్రామికవర్గాల కన్ను సుందర నగరం విశాఖపై ఏనాడో పడింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు చాలా కాలం క్రితం విశాఖలో వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థలు నెలకొల్పారు. వైజాగ్‌లో నేడు పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఆసుపత్రులు వంటి వాటిని గోదావరి జిల్లాలకు చెందిన వారే అధికంగా స్థాపించారు. నేడు విశాఖలో చక్రం తిప్పుతున్న ప్రముఖ రాజకీయ నాయకుల్లో పలువురు గోదావరి జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం!
కాగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విశాఖ ఇన్‌ఛార్జ్‌గా జగన్ నియమించారు. అత్యంత వ్యూహాత్మకంగా సాయిరెడ్డిని ఇక్కడ ఉంచినట్టు తాజా పరిణామాలతో స్పష్టమయ్యిందని రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి.
విశాఖలో విజయసాయిరెడ్డి మకాం వేసి రాజధాని ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహా అతి కొద్ది మంది కీలక నేతలతో సాధ్యాసాధ్యాలపై కూలంకుషంగా చర్చించారని, స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని చెప్పుకుంటున్నారు.
వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుండీ విశాఖపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూవచ్చారు. 2014 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పోటీ చేసి పరాజయం పొందారు. 2019 ఎన్నికల్లోనూ విశాఖ నగరంలో వైకాపాకు చేదు అనుభవం ఎదురయ్యింది. విశాఖ పార్లమెంట్‌కు వైకాపా అభ్యర్ధి పంవీవీ సత్యనారాయణ విజయం సాధించినప్పటికీ విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తర, దక్షిణ అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం కైవశం చేసుకుంది.
విశాఖ నగరం తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నట్టు స్పష్టమైనప్పటికీ జగన్ మాత్రం ఈ నగరంపై ఎనలేని మక్కువతో ఉన్నట్టు ఇపుడు రుజువయ్యింది. విశాఖను కీలక రాజధానిగా ప్రకటించడం ద్వారా ఈ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చినట్టయ్యింది.
ఇకపై విశాఖలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటుకానుంది. మంత్రుల బస కూడా ఇక్కడే! కీలకమైన పాలనకు ఈ విశ్వనగరం వేదిక కానుంది. ఇదిలావుంటే విశాఖను ఇలా రాజధానిగా ప్రకటించారో లేదో అలా రియల్టర్లలో హడావుడి మొదలయ్యింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోని భూములకు రెక్కలొచ్చాయి. ఇళ్ళు, ఇళ్ళ స్థలాల ధరలు, అపార్ట్‌మెంట్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ మాఫియా విశాఖ కేంద్రంగా చెలరేగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
అనూహ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించడంతో సామాన్యులకు నేటికీ ఈ పరిణామం అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ విశ్వనగరంగా త్వరలోనే రూపు దిద్దుకోనుందన్న విశ్వాసంతో ప్రజలున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల ప్రజలు అధిక సంఖ్యలో విశాఖ వైపు మొగ్గు చూపుతున్నారు.
సమీప జిల్లా కావడం, రాకపోకలకు అనుకూలంగా ఉండటం, రైలు, రోడ్డు కనెక్టివిటీ బాగా ఉండడంతో పాటు విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విశాఖ ఓ మణిదీపంగా ఉండటం పొరుగు జిల్లాల వాసులకు అనుకూలంగా పరిణమించింది. అలాగే విశాఖ-కాకినాడ తీర ప్రాంత ప్రజలు సైతం విశ్వనగరంపై ప్రత్యేక దృష్టి సారించారు.
డి శ్రీనివాస్‌కృష్ణ