నంద‌మూరిలో నారా పౌరుషం ఏదీ?

పౌరుషానికి “నారా” మారుపేరుగా నిలుస్తోంది. నారా వంశ‌స్తుల పౌరుషం ఏంటో టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్ మాట‌లు వింటే తెలుస్తుంది. పౌరుషం మ‌నిషికి అలంకారం. పౌరుషం లేని జీవితం వృథా అని పెద్ద‌లు చెబుతారు.…

పౌరుషానికి “నారా” మారుపేరుగా నిలుస్తోంది. నారా వంశ‌స్తుల పౌరుషం ఏంటో టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్ మాట‌లు వింటే తెలుస్తుంది. పౌరుషం మ‌నిషికి అలంకారం. పౌరుషం లేని జీవితం వృథా అని పెద్ద‌లు చెబుతారు. త‌మ‌నెవ‌రైనా దూషిస్తే స‌ర్ది చెప్పుకుని పోయేవాళ్లుంటారు. కానీ త‌ల్లిదండ్రుల‌ను, కుటుంబంలోని మ‌హిళ‌ల‌ను అంటే మాత్రం ఊరుకునే వాళ్లు త‌క్కువే.

నారా లోకేశ్‌లో కూడా ఆ క‌సే క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై తాను అన్న మాట‌ల‌కు టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ వికృత రాజ‌కీయ క్రీడ ఇంత‌టితో ముగిసింద‌ని అంద‌రూ భావించారు. అయితే టీడీపీ, ఆ పార్టీకి వంత పాడే ఎల్లో మీడియా వైఖ‌రి చూస్తే మాత్రం… ఆ ఎపిసోడ్‌ను రాజ‌కీయంగా వాడుకునేందుకే సిద్ధ‌మైన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లిపై దూష‌ణ‌కు సంబంధించి నారా లోకేశ్ ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. ఈ మాత్రం పౌరుషం నంద‌మూరి వంశ‌స్తుల్లో ఏదీ? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

“మీరా మాట్లాడేది మా త‌ల్లి గురించి. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోండి. నేను చెబుతున్నా తీవ్ర పరిణామాలు ఉండ‌బోతున్నాయి. నేను వ‌దిలిపెట్ట‌ను మీరు ఎక్క‌డున్నా?  మీరు అనుకోవ‌చ్చు పెద్దాయ‌న వ‌దిలిపెడ‌తార‌ని. ఆయ‌న‌ది చాలా పెద్ద మ‌న‌సు. నాకైతే ఉండ‌దు. గుర్తు పెట్టుకోమ‌ని చెబుతున్నా. వ‌ర‌ద బాధితుల‌కు రూ.కోటి సాయం చేసిన మా అమ్మ‌ను దూషిస్తారా? సాయం చేయ‌డం త‌ప్పా?” అని లోకేశ్ హెచ్చ‌రించారు. త‌న తండ్రి చంద్ర‌బాబులా తాను మంచి వ్య‌క్తి కాద‌ని ప్ర‌త్య‌ర్థుల‌కు ఘాటు హెచ్చ‌రిక చేశారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌ను సీఎం పీఠంపై నుంచి తోసేసి, ఆయ‌న‌పై వైస్రాయ్ హోట‌ల్ ఎదుట చెప్పులు వేయించిన ఘ‌ట‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తండ్రిని, తాత‌ను అవ‌మానించినా…ఎందుక‌ని నంద‌మూరి వంశ‌స్తుల్లో లోకేశ్‌లా పౌరుషం, చ‌ల‌నం లేవ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయ‌లు అమ్ముకున్న చందంగా, ఎన్టీఆర్ పేరుతో సినీ, రాజ‌కీయ కెరీర్ బిల్డ‌ప్ చేసుకున్న‌, చేసుకుంటున్న వార‌సుల‌కు ఆయ‌న ఆత్మ‌ఘోష ప‌ట్ట‌దా? అని ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మా బ్ల‌డ్‌ వేరు, బ్రీడ్ వేరు  అంటూ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప‌, తండ్రికి జ‌రిగిన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నే పౌరుషం ఎక్క‌డ‌? అంటూ నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.