టీడీపీలో ఆ ఇద్ద‌రికి బాబు షాక్‌!

టీడీపీలో ఇద్ద‌రు ముఖ్య నాయ‌కుల‌కు చంద్ర‌బాబునాయుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి పెద్ద‌పీట వేసి… త‌మ నాయ‌కుల‌కు బాగా బుద్ధి చెప్పార‌ని ఆ ఇద్ద‌రు నేత‌ల‌ అన‌చ‌రులు వాపోతున్నారు.…

టీడీపీలో ఇద్ద‌రు ముఖ్య నాయ‌కుల‌కు చంద్ర‌బాబునాయుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి పెద్ద‌పీట వేసి… త‌మ నాయ‌కుల‌కు బాగా బుద్ధి చెప్పార‌ని ఆ ఇద్ద‌రు నేత‌ల‌ అన‌చ‌రులు వాపోతున్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్తగా ఎంపీ కేశినేని నానీకి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ఆ పార్టీలో అసంతృప్తుల‌కు దారి తీసింది.

కేశినేని నానీ నియామ‌కాన్ని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, టీడీపీ అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా జీర్ణించుకోలేకున్నార‌ని స‌మాచారం. ఈ ప‌ద‌విని త‌మ‌లో ఎవ‌రికిచ్చినా క‌లిసి ప‌ని చేసుకుంటామ‌ని గ‌త కొంత కాలంగా బుద్ధా, నాగుల్ కోరుతున్నారు. కానీ ఇద్ద‌రినీ కాద‌ని, నానీ నియామ‌కంపై వాళ్లు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లిద్ద‌రూ బ‌హిరంగంగా ఏమీ మాట్లాడ‌క‌పోయినా, అంత‌ర్గ‌తంగా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు స‌మాచారం.

కేశినేనితో విభేదాలు గ‌త న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కేశినేని కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డాన్ని బుద్ధా, నాగుల్‌, బొండా ఉమా  బ‌హిరంగంగానే వ్య‌తిరేకించారు. అంతేకాదు, కేశినేని నాని, బుద్ధా వెంక‌న్న మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైట్ జ‌రిగింది. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ యాక్టీవ్‌గా లేక‌పోవ‌డంతో పార్టీ దృష్టి సారించింది.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా గ‌త కొంత కాలంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉన్న‌ట్టుండి వారిని కాద‌ని, కేశినేని నానీకి స‌మ‌న్వ‌య‌క‌ర్త బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. బుద్ధా వెంక‌న్న ఇంటికి వెళ్లిన ఆయ‌న అనుచ‌రులు కేశినేని నియామ‌కాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేద‌ని తేల్చి చెప్పారు. కేశినేనికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

మ‌రోవైపు పుండు మీద కారం చ‌ల్లిన చందంగా బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని ఆదేశించ‌డం వారికి కోపం తెప్పించింది. నియోజకవర్గంలో డివిజన్‌ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని నానికి అధిష్ఠానం స్వేచ్ఛ ఇచ్చింది. పార్టీలో క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కు విలువ ఎక్క‌డుంద‌ని, కేవ‌లం సామాజిక వ‌ర్గ‌మే అర్హ‌త‌గా కేశినేని నానీకి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఏంట‌ని బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.