వెంకటేశ్ ‘మహా’ చెత్త లాజిక్.. భారీ ట్రోలింగ్

ఒకడు హిట్ కొడితే, పక్కోడికి ఎప్పుడూ కడుపుమంట ఉంటుంది. ఇండస్ట్రీలో ఇది ఓపెన్ సీక్రెట్. అయితే అలా వచ్చిన హిట్ ను వెక్కిరించడం మాత్రం అస్సలు సమంజసం అనిపించుకోదు. ఎందుకంటే, ఆ సినిమా అంత…

ఒకడు హిట్ కొడితే, పక్కోడికి ఎప్పుడూ కడుపుమంట ఉంటుంది. ఇండస్ట్రీలో ఇది ఓపెన్ సీక్రెట్. అయితే అలా వచ్చిన హిట్ ను వెక్కిరించడం మాత్రం అస్సలు సమంజసం అనిపించుకోదు. ఎందుకంటే, ఆ సినిమా అంత పెద్ద హిట్టయిందంటే, ఆ కంటెంట్ ను ప్రేక్షకులంతా ముక్తకంఠంతో అంగీకరించారని అర్థం. సో.. హిట్ కొట్టిన దర్శకుడిపై కుళ్లు పెంచుకోవడంలో తప్పులేదు, కానీ ఆ దర్శకుడు ఇచ్చిన సక్సెస్ ను తప్పుబట్టడం అంటే, ప్రేక్షకుల్ని కించపరచడం కిందే లెక్క.

నీచ్ కమీన్ కుత్తే కేజీఎఫ్..

ఇప్పుడిదంతా ఎందుకంటే, వెంకటేశ్ మహా అనే దర్శకుడు దేశవ్యాప్తంగా హిట్టయిన కేజీఎఫ్ సినిమాపై తనకిష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశాడు. అసలు ఆ సినిమా కథలోనే పెద్ద బొక్క ఉందనేది ఇతగాడి ఫీలింగ్. అతడు ఏమన్నాడో యాజ్ ఇటీజ్ గా చూద్దాం.

“తల్లి ఓ కొడుకును ఎప్పటికైనా గొప్పోడు అవ్వమని కోరుతుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని ఆమె ఉద్దేశం. అతడు మనుషుల్ని పెట్టి బంగారం తవ్విస్తాడు. వాడి దగ్గర కొన్ని వేల మంది పనివాళ్లు ఉంటారు. వాళ్లకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు ఇచ్చి, మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారేస్తాడు. వాడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడుగుతుంది. ఆ మహాతల్లిని నేను ఒకసారి కలవాలి. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం.”

ఇలా కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వెంకటేష్ మహా. అక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యల్ని సామాజిక చర్చ కింద మార్చేశాడు. అలాంటి సినిమాలు తాము కూడా (పక్కనే ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ ఉన్నారు) తీయగలమని, కేవలం విలువలకు కట్టుబడి తీయడం లేదని సమర్థించుకున్నాడు.

“ప్రేక్షకుల్లో మాకున్న క్రెడిబిలిటీ వల్ల అలాంటి సినిమాలు తీయడం లేదు. మేం అభ్యుదయవాదం పక్కనపెట్టి, పెన్ను బదులు కత్తి పట్టుకుంటే, వాళ్లు బాబులాగ సినిమా తీస్తాం. మాకున్న సృజనాత్మక దృష్టికి హింసను కూడా సౌందర్యాత్మకంగా చూపించగల శక్తి మాకుంది. కానీ మేం కావాలనే అలాంటి పనులు చేయడం లేదు. అందుకే మేం లోకువ అయిపోతున్నాం.”

ఎవడు తీయొద్దన్నాడు మహా..

వెంకటేశ్ మహా స్టేట్ మెంట్స్ పై సోషల్ మీడియా భగ్గుమంటోంది. నిన్ను ఎవడు కేజీఎఫ్ లాంటి సినిమాలు తీయొద్దన్నాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కేజీఎఫ్ లాంటి స్క్రీన్ ప్లేతో సినిమా తీయడం చేతకాక, చర్చావేదికల్లో కూర్చొని మాట్లాడుతున్నాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

2 సినిమాలు తీసిన దర్శకుడు కూడా కేజీఎఫ్ లాంటి సినిమాను విమర్శించడం తగదంటున్నారు చాలామంది. కేవలం తీయడం చేతకాక, ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఎక్కువమంది ఆరోపిస్తున్నారు. కొన్ని జానర్లు కొందరు మాత్రమే తీయగలరని, యాక్షన్ జానర్ లో వెంకటేష్ మహా సినిమాలు తీయలేడని మరికొందరు ప్రతిస్పందిస్తున్నారు.

సిసలైన వాదన ఇది..

ఇదే ట్రోలింగ్ లో ఓ సహేతుకమైన చర్చ కూడా మొదలైంది. కేజీఎఫ్ స్టోరీలైన్ ను వెంకటేష్ మహా తప్పుదోవ పట్టించాడని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. “పుట్టినప్పుడు ఎలా పుట్టామనేది మన చేతిలో లేదని, కానీ చనిపోయేటప్పుడు మాత్రం కోటీశ్వరుడిగా చనిపోవాలని హీరోను తల్లి కోరుకుంది.” తల్లి కోరిక మేరకు హీరో షిప్ లోడ్ బంగారంతో సముద్రంలో పడి చనిపోతాడని కొందరంటున్నారు. ఈ వాదన నిజమే.

తనను నమ్ముకొని ఉన్న జనాలకు కాస్తోకూస్తో మంచి చేస్తూనే, తల్లి కోరికను నెరవేర్చేందుకు బంగారాన్ని కూడబెట్టి, అదే బంగారంతో చనిపోతాడు హీరో. సినిమా పార్ట్-1లో మొదలుపెట్టి, పార్ట్-2లో క్లయిమాక్స్ వరకు మొత్తం ఇదే లైన్ లో నడుస్తుంది. ఇది కూడా తప్పు అన్నట్టు వెంకటేష్ మహా మాట్లాడాడు.

సినిమా అనేది వినోదం. ప్రేక్షకుడికి రెండున్నర గంటల పాటు ఎంటర్ టైన్ మెంట్ అందించామా లేదా అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. ఏ కథను ఎంచుకున్నాం, సన్నివేశాన్ని ఎలా చెప్పాం, చెప్పాలనుకున్న పాయింట్ ను ఎలా ప్రజెంట్ చేశామనేది పూర్తిగా మేకర్ దృక్కోణానికి సంబంధించిన అంశం. ఆ క్రియేటివిటీని తప్పుబట్టడం భావదారిద్ర్యం కిందకే వస్తుంది. 

ఓ సినిమాను సమీక్షకుడు రివ్యూ చేయడం తప్పు కాదు, అది అతడి వృత్తి. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఓ సినిమాను, తోటి దర్శకుడు విమర్శించడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అన్నట్టు వెంకటేష్ మహా మాట్లాడుతుంటే, పక్కనే కూర్చొని పగలబడి నవ్విన ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయపై కూడా భారీ ట్రోలింగ్ నడుస్తోంది.