భూమా మౌనిక రాజకీయ ప్రవేశంపై తిరుమల ఏడు కొండల సాక్షిగా ఆమె భర్త మంచు మనోజ్ తన మనసులో మాటను బయట పెట్టారు. కొత్త జంట మనోజ్, మౌనిక, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందించాలని మనోజ్‌ను మీడియా ప్రతినిధులు అడిగారు. మనోజ్ స్పందిస్తూ ప్రజా సేవ చేయాలని ఉందన్నారు. కానీ రాజకీయాల్లోకి రావాలని తనకు లేదన్నారు. మౌనిక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం తన మద్దతు ఉంటుందంటూ ఆమె వైపు చూస్తూ చెప్పడం విశేషం. తమ ఇద్దరినీ కలిపింది కూడా సేవ చేయాలనే ఆశయమే అని ఆయన చెప్పుకొచ్చారు.
రానున్న రోజుల్లో కూడా ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నట్టు మనోజ్ తెలిపారు. దేవుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్టు మనోజ్ తెలిపారు. దీంతో మనోజ్, మౌనిక జంట రాజకీయ ప్రవేశంపై కొంత స్పష్టత వచ్చింది. ప్రజాసేవ చేయాలని మనసులో ఉందని చెప్పడం అంటే, రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశాన్ని పరోక్షంగా బయట పెట్టారనే చర్చ నడుస్తోంది.
ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెప్పుకోతగ్గ ఆదరణ వుంది. అయితే వారసులుగా ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్న వారు సరైన ప్రాతినిథ్యం వహించడం లేదనే విమర్శ వుంది.
రకరకాల కేసుల్లో తరచూ ఇరుక్కుంటూ భూమా నాగిరెడ్డి దంపతుల ఇమేజ్ను దెబ్బతీస్తున్నారనే ఆవేదన వారి వర్గంలో వుంది. సరైన వారసులు వస్తే మాత్రం భవిష్యత్ వుంటుందనే అభిప్రాయం లేకపోలేదు. ఆ పని మౌనిక చేస్తుందనే ప్రచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుతోంది.
త్వరలో ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో మౌనిక కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఇందుకు మనోజ్ మాటలు బలం చేకూరుస్తున్నాయి.