తీహార్ జైలుకు మాజీ మంత్రి

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. గ‌తంలో కోర్టు అనుమతించిన…

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. గ‌తంలో కోర్టు అనుమతించిన ఏడు రోజుల సీబీఐ క‌స్ట‌డీ విచార‌ణ గ‌డువు ముగియ‌డంతొ సిసోడియాను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 20 వ‌ర‌కు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు.

ఇప్ప‌టికే మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతో ఆప్ నేతలు, కార్యకర్తల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అరెస్టు చేయడం పక్కా వ్యూహమని ఆ పార్టీ ఆరోపించింది. గ‌త వారం సిసోడియా అరెస్టును ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఎనిమిది మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చాలా మంది ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. మరికొంత మంది సూత్రధారుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. కాగా గ‌తంలో ఢిల్లీ మంత్రిగా చేసిన స‌త్యేంద్ర జైన్ కూడా మ‌నీలాండ‌రింగ్ కేసులో జైలులోనే ఉన్నారు.