ఇదేం స‌వాల్ లోకేశా?

యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్‌కు తానేం మాట్లాడుతున్నారో అర్థ‌మ‌వుతున్న‌ట్టుగా లేదు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కంటే త‌న‌ను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు. త‌న‌ది సీఎం స్థాయి కంటే ఎక్కువ‌నే భ్ర‌మ‌లో ఊరేగుతూ, జ‌గ‌న్‌పై…

యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న లోకేశ్‌కు తానేం మాట్లాడుతున్నారో అర్థ‌మ‌వుతున్న‌ట్టుగా లేదు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కంటే త‌న‌ను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు. త‌న‌ది సీఎం స్థాయి కంటే ఎక్కువ‌నే భ్ర‌మ‌లో ఊరేగుతూ, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఓ స‌వాల్ విసిరారు. ద‌మ్ము, ధైర్యం వుంటే 175కు 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ఆ ఇద్ద‌రు నాయ‌కులు చెప్ప‌గ‌ల‌రా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

దీనికి మాత్రం టీడీపీ, జ‌న‌సేన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తేలు కుట్టిన దొంగ‌ల్లా ఎక్క‌డి వారు అక్క‌డ గ‌ప్‌చుప్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న నారా లోకేశ్ త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌వాల్ విస‌ర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కూ లోకేశ్ ఏమంటున్నారంటే…

కంచుకోట‌లో గెలిచి గొప్ప‌లు చెప్ప‌డం కాద‌ని, వైసీపీ గెల‌వ‌ని చోట పోటీ చేసి గెలిచే స‌త్తా జ‌గ‌న్‌కు ఉందా? అని లోకేశ్ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీకి ఏ మాత్రం ప‌ట్టులేని మంగ‌ళ‌గిరిలో గెలిచి కంచుకోట‌గా మారుస్తాన‌ని ఆయ‌న అన్నారు. సీఎం జ‌గ‌న్‌కు పులివెందుల కంచుకోట అని లోకేశ్ తేల్చి చెప్పారు. క‌నీసం ఆ మాత్రం స్పృహ ఉన్నందుకైనా ఆయ‌న్ను అభినందించాల్సిందే. పులివెందుల అనేది వైఎస్ కుటుంబానికి స్వ‌స్థ‌లం. పుట్టిన గ‌డ్డ‌ను త‌మ కుటుంబ అడ్డాగా మార్చుకున్నారు.

ఇదే చంద్ర‌బాబుకు చంద్ర‌గిరి స్వ‌స్థ‌లం. టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్ర‌బాబు కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మి మూట క‌ట్టుకున్నారు. సినీ హీరో అయిన త‌న మామ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌లేర‌నే ఉద్దేశంతో, పిల్ల‌నిచ్చిన‌ప్ప‌టికీ అటు వైపు చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. 

ఎప్పుడైతే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి భ‌విష్య‌త్ ఉంద‌ని గ్ర‌హించారో వెంట‌నే ఆ పార్టీలో చేరిపోయారు. 1978లో చంద్ర‌గిరిలో గెలుపొంది, 1983లో ఓడిపోయిన త‌ర్వాత మ‌కాం మార్చారు. ఆ త‌ర్వాత కాలంలో చంద్ర‌గిరి త‌న‌కు సుర‌క్షిత‌మైన నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని ప‌సిగ‌ట్టారు. దీంతో ఆయ‌న కుప్పానికి వ‌ల‌స వెళ్లారు. 1989 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ కుప్పం నుంచి గెలుపొందుతూ వ‌చ్చారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాద‌ర‌ణ కోల్పోయిన తన తండ్రి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన విష‌యాన్ని లోకేశ్ మ‌రిచిన‌ట్టున్నారు. క‌నీసం త‌నకంటూ సుర‌క్షిత‌మైన నియోజ‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబునాయుడు ఇవ్వ‌లేక‌పోయార‌నే వాస్త‌వాన్ని లోకేశ్ బ‌య‌ట పెట్ట‌డానికి ధైర్యం చేయ‌డం లేదు. 

ఇప్పుడు పులివెందుల కాకుండా, మ‌రోచోట జ‌గ‌న్ పోటీ చేయాల‌ని స‌వాల్ విస‌ర‌డంలో ఔచిత్యం వుందా? త‌న మాదిరే జ‌గ‌న్ కూడా ఓడిపోవాల‌ని లోకేశ్ కోరుకుంటున్నారా? అందుకేనా ఓడిపోయే చోట గెల‌వాల‌ని లోకేశ్ స‌వాల్ విసురుతున్నార‌నే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. లోకేశ్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.