ఏపీ జనం ప్రశాంతంగా ఉండటం కోసం రాయలసీమకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు ఓ సలహా ఇచ్చాడు. ఈమధ్య ప్రశాంతత కోసం అనేకమంది అనేక రకాల బోధనలు చేస్తున్నారు. దీన్నే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటున్నారు. అంటే రకరకాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొంది ప్రశాంతంగా ఉండటానికి పలు విధానాలు బోధిస్తున్నారు. యెగా, మెడిటేషన్, పలు రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా.
జనం తండోపతండాలుగా ఇలాంటి కార్యక్రమాలకు వెళుతున్నారు. అయితే ఈ రాయలసీమ నాయకుడు ప్రశాంతత కోసం కళ్లు మూసుకొని కూర్చోమని చెప్పడంలేదు. ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి ప్రశాంతత కోసం రాజకీయ సలహాలే ఇస్తున్నాడు. ఇంతకూ ఎవరీ మహానుభావుడు? అనే కదా మీ సందేహం.
ఒకప్పుడు కాంగ్రెసు పార్టీ నాయకుడు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత టీడీపీ నాయకుడు. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. ఉత్త నాయకుడు కాదులెండి. పార్లమెంటు సభ్యుడు కూడా. ఆయనే టీజీ వెంకటేష్. ప్రస్తుతం ఏపీ చాలా గందరగోళంగా ఉంది.
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల గురించి ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని ప్రాంతమైన అమరావతిలో పది రోజులకు పైగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాలకు చెందినవారు ఉద్యమం చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లోనూ జనం అశాంతిగానే ఉన్నారు. రాయలసీమవాసులు హైకోర్టు ఒక్కటే కాదు, మొత్తం రాజధాని తమకే ఇవ్వాలంటున్నారు.
ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉందని, హైదరాబాదు కోసం దాన్ని త్యాగం చేశామని, కాబట్టి రాజధాని కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేశ్‌తోపాటు మైసూరారెడ్డి తదితర సీమ నాయకులు తెర మీదికి వస్తున్నారు.
సరే…ఇంతకూ టీజీ వెంకటేష్ ఏమంటున్నాడు? ఏపీలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మూడు ప్రాంతాల్లో అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో మూడు అసెంబ్లీలు ఏర్పాటు చేయాలట…! మూడు ప్రాంతాల్లోనూ సచివాలయాలు ఏర్పాటు చేయాలట…! హైకోర్టు బెంచీలు పెట్టాలట…!
ఇలా చేసినందువల్ల మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేసినట్లుగా ఉంటుంది కదా అంటున్నాడు టీజీ వెంకటేష్. రాజధాని విషయమై ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఓ నివేదిక ఇవ్వబోతోంది. ఇవి రెండూ అధ్యయనం చేసి మంత్రులు-ఐఏఎస్ అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఓ నివేదిక ఇస్తుంది.
కాబట్టి టీజీ వెంకటేష్ కూడా తన ఆలోచలనకు అనుగుణంగా నివేదిక తయారుచేసి సర్కారుకు ఇస్తే బాగుంటుందేమో…! ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాననే అపవాదు తన మీద పడుతోందన్న టీజీ ఇంతకుముందు విద్వేషపూరిత వ్యాఖ్యలే చేశాడు. రాజధానికి ఉండే అన్ని హంగులు, సౌకర్యాలు కర్నూలుకు ఇవ్వాలని, లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు, ఉద్యమాలు పెరిగే అవకాశం ఉందన్నాడు.
'రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇదివరకే నేను చెప్పాను' అని మీడియాతో అన్నాడు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కర్నూలుకు రాజధాని ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు విశాఖపట్టణానికి రాజధాని ఇచ్చి మళ్లీ కర్నూలుకు అన్యాయం చేశారన్నాడు.
టీజీ వెంకటేష్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే హైకోర్టు కర్నూలుకు వెళ్లి వారు తృప్తిపడేలా లేరనిపిస్తోంది. మైసూరా రెడ్డి అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. జగన్ మూడు రాజధానుల ప్లాన్ అమలు జరిగితే రాయలసీమ రగులుతుందా?