ముఖ్యమంత్రి జగన్మొహనరెడ్డి సీబీఐ కేసుల విషయంలో గత కొన్నేళ్ళుగా ఇబ్బంది పడుతున్న సంగతి విధితమే. ఆయన సీఎం హోదాలో బిజీగా ఉంటున్నా కూడా కోర్టులు, కేసులు, వాయిదాలతో అవస్థలు పడుతున్నారు. అయితే ఈ బాధలన్నీ ఆయనకు 2020లో తప్పుతాయట.
ఈ విషయాన్ని విశాఖలోని మహాకామేశ్వరి పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్నపంతులు చెప్పుకొచ్చారు. రాబోతున్న 2020 సంవత్సరం జగన్ కి అన్ని విధాలుగా బాగుంటుందని, కలసి వస్తుందని కూడా ఆయన అంటున్నారు. అంతే కాదు జగన్ మీద పెట్టిన సీబీఐ కేసులు కూడా పరిష్కారం అయి ఆయనకు క్లీన్ చిట్ లభిస్తుందని కూడా పీఠాధిపతి అంటున్నారు.
ఇదిలా ఉండగా విశాఖను రాజధానిగా ప్రతిపాదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచివారు, శాంతస్వభావులు అయిన విశాఖ ప్రజలకు ఇది జగన్ ఇచ్చిన వరంగా పేర్కొన్నారు.
జగన్ నాయకత్వంలో విశాఖ అన్ని విధాలుగా అభివ్రుధ్ధిపధంలో సాగుతుందని కూడా అయ్యన్నపంతులు అంటున్నారు. విశాఖకు ఎంతో చరిత్ర ఉందని, అటువంటి నగరానికి మహర్దశ కలిగించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం స్వాగతించతగ్గ విషయం అంటున్నారు.
విశాఖతో పాటు ఏపీని పూర్తిగా అభివ్రుధ్ధి చేసేది జగన్ మాత్రమేనని ఆయన చెబుతున్నారు. జగన్ 2020లో మరిన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు బాగా చేరువ అవుతారని, రానున్న రోజుల్లో ఏపీ కూడా దేశంలోనే నంబర్ వన్ గా మారుతుందని అయ్యన్నపంతులు జోస్యం చెప్పారు. మొత్తానికి 2020 జగన్ కి కలసివచ్చే ఏడాదిగా ఆయన పక్కా క్లారిటీతో చెబుతున్నారు.