ట్వీట్ కాదు ట్రూత్ చెప్పు లోకేశ్‌

లోకేశ్‌, ట్విట్ట‌ర్ క‌వ‌ల పిల్ల‌లున్న‌ట్టున్నారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు విడిచి ఉండ‌లేనంతగా వారి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది. రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న ప‌దేప‌దే ట్విట్ట‌ర్ ఎక్కి త‌న‌దైన శైలిలో సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నాడు. శుక్ర‌వారం…

లోకేశ్‌, ట్విట్ట‌ర్ క‌వ‌ల పిల్ల‌లున్న‌ట్టున్నారు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు విడిచి ఉండ‌లేనంతగా వారి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది. రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న ప‌దేప‌దే ట్విట్ట‌ర్ ఎక్కి త‌న‌దైన శైలిలో సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నాడు. శుక్ర‌వారం కూడా ఆయ‌న అదే పంథాను కొన‌సాగించాడు.

పేద‌రికానికి కూడా కులం ఉంటుందా అంటూ ప‌లు అంశాల‌ను సీఎం దృష్టికి తీసుకొస్తూ ఆయ‌న ప్ర‌శ్నించాడు. రాజ‌ధాని కోసం  29,881 మంది రైతులు 34,322 ఎకరాలు ఇచ్చాడ‌ని చెప్పాడు. వీరిలో ఒక ఎక‌రం కంటే  తక్కువ ఉన్న రైతులు 20,490 మంది అని, 1- 2 ఎకరాల మధ్య ఉన్న వారు 5,227 మంది, కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉంద‌ని ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించాడు. అందులో కూడా కొంతమందివి ఉమ్మడి కుటుంబాలున్నాయ‌ని తెలిపాడు. 25,717 మంది అంటే సుమారు 90 శాతం మంది సన్నకారు రైతులేన‌ని చెప్పాడు. వైసీపీ నేతలు వీళ్లకేనా కులం అంటగట్టి కక్ష తీర్చుకుం టోంద‌ని లోకేశ్ నిల‌దీశాడు. ఈ పేదలేనా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ చెబుతోంది? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

లోకేశ్ ఒక విష‌యాన్ని మ‌రిచాడు. రాజ‌ధానికి భూములిచ్చిన వారితో స‌మ‌స్య కాదు. రాజ‌ధాని రైతుల‌ను మోసం చేసి ముంద స్తుగానే రాజ‌ధాని ఎక్క‌డొస్తున్న‌దో తెలుసుకుని కేవ‌లం ఆరు నెల‌ల్లో 4,070 ఎక‌రాల‌కు పైగా కొన్న భూబ‌కాసురుల‌తోనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఆయ‌న ఎందుకు గుర్తించ‌డం లేద‌నేదే ప్ర‌శ్న‌.

2014 జూన్ ఒక‌టి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కేవ‌లం ఆర్నెళ్ల వ్య‌వ‌ధిలో జ‌గ్గ‌య్య‌పేట‌లో ఎక‌రా రూ.ల‌క్ష చొప్పున 498 ఎక‌రాల‌ను కొన్న  వీబీసీ ఫ‌ర్టిలైజ‌ర్స్ య‌జ‌మాని ఎంఎస్‌బీ రామారావు త‌న‌కు ఏమ‌వుతాడో లోకేశ్ లోకానికి స‌మాధానం చెప్పాలి. త‌న మామ బాల‌కృష్ణ‌కు ఆయ‌న వియ్యంకుడు అవుతాడ‌నే వాస్త‌వాన్ని లోకేశ్ ఎందుకు దాస్తున్నాడు?  త‌న సొంత సంస్థ హెరిటేజ్‌కు 14.22 ఎక‌రాలు కొనుగోలు చేసిందాన్ని ఎందుకు చెప్ప‌డం లేదు? ప‌్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో తండ్రితో క‌లిసి ఉంటున్న‌ లింగ‌మ‌నేని ర‌మేష్ 351 ఎక‌రాల కొనుగోలు చేయ‌డం వెనుక భూభాగోత దోపిడీ మాటేమిటి? రాజ‌ధాని ఎంపిక  క‌మిటీకి నేతృత్వం వ‌హించిన మాజీ మంత్రి నారాయ‌ణ త‌న బినామీల‌తో కొనుగోలు చేసిన 55 ఎక‌రాలు…ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత దోపిడీ లిస్ట్ ఉంది.

రాజ‌ధాని రైతుల‌పై ఎవ‌రికీ క‌క్ష లేదు. ఎందుకంటే వారు రాజ‌ధాని కోసం భూమిలిచ్చారు. కానీ మీరు రాజ‌ధాని భూములు కొన్న‌వాళ్లు. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. ఒక‌రేమో మోస‌పోయిన వాళ్లు (రాజ‌ధాని రైతులు), ఇత‌రులేమో మోస‌గించిన వాళ్లు (భూములు కొన్న‌వాళ్లు).  ప్ర‌స్తుతం రాజ‌ధాని త‌ర‌లింపు ఆలోచ‌న‌కు మీ దోపిడీ కార‌ణం కాదా?  ప‌దేప‌దే కులాన్ని అడ్డు పెట్టుకుని రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌తో రాజ‌ధాని రైతుల‌కు కులం అంట‌గ‌డుతున్న‌దెవ‌రు? ఈ విష‌యాల‌న్నింటిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్రూత్ చెప్పాల‌ని జ‌నం కోరుకుంటున్నారు లోకేశ్‌. చేత‌నైతే ట్రూత్ మాత్ర‌మే చెప్పండి సార్‌!