సీఎం వైఎస్‌ జగన్‌కి తలనొప్పి వాళ్ళతోనేనా.?

అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి నేతలు నానా తంటాలూ పడటం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలోనూ జరిగింది, వైఎస్సార్‌ హయాంలోనూ జరిగింది.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలోనూ అదే జరుగుతోంది. రాజధాని…

అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి నేతలు నానా తంటాలూ పడటం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలోనూ జరిగింది, వైఎస్సార్‌ హయాంలోనూ జరిగింది.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలోనూ అదే జరుగుతోంది. రాజధాని విషయమై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ స్పష్టతతో వున్నారు. ముఖ్యమంత్రిగా తన ఆలోచనని ఆయన అసెంబ్లీలోనే చూచాయిగా చెప్పేశారు. అలాంటప్పుడు విషయాన్ని చాలా 'డీసెంట్‌'గా చక్కబెట్టేయాల్సి వుంటుంది.

అయితే, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు మాత్రం, సందట్లో సడేమియా.. అంటూ రెచ్చిపోతున్నారు. మొదట్లో ఈ తీరు అధికార పార్టీకి ప్లస్‌ అయినా, క్రమక్రమంగా మైనస్‌ అవుతూ వస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఇంకో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా పలువురు వైసీపీ ముఖ్య నేతలు, రాజధాని వ్యవహారంపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ రోజు ఇంత అలజడి చోటు చేసుకుందంటే దానిక్కారణం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలే. వాస్తవానికి మూడు రాజధానులంటూ.. వైఎస్‌ జగన్‌ తెరపైకి తెచ్చిన ఆలోచన, కాస్త సావధానంగా ఆలోచిస్తే ఎవరికైనా అద్భుతంగానే అన్పిస్తుంది. దాన్ని మామూలుగా అయితే ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి వుండదు.

కానీ, ఇక్కడ ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్నది వైసీపీ ముఖ్య నేతల వ్యూహం. ఆల్రెడీ చచ్చిన పాములా తయారైంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇలాంటి స్థితిలో తెలుగుదేశం పార్టీని రాజధాని పేరుతో దెబ్బ కొట్టాల్సిన అవసరమేంటో వైసీపీ ముఖ్య నేతలకే తెలియాలి. టీడీపీని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ నేతల అత్యుత్సాహం కాస్తా, రాయలసీమలో రాజధాని డిమాండ్‌కి కారణమైంది. అంటే, విషయం మరింత కాంప్లికేటెడ్‌ అవుతోందన్నమాట.

మొత్తంగా చూస్తే, 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి విపక్షాల నుంచి తలనొప్పులేమీ లేవు.. చిన్న చిన్న సమస్యలొచ్చినా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ, సొంత పార్టీ నేతల అత్యుత్సాహం, అధికార పార్టీ కొంప ముంచే స్థాయికి తీసుకెళుతుండడమే కాస్తంత ఇబ్బందికరం. కాస్తంత కాదు, చాలా చాలా ఇబ్బందికరం. ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ కాస్త అప్రమత్తం కాకపోతే, బొత్స లాంటి నేతలతో వైసీపీకి తిప్పలు తప్పవు.