ఇప్పుడు ఎవరి నోట విన్నా రాజధాని మాటే. శ్రీకాకుళం మొదలుకుని కడప వరకు రాజధానిపై రచ్చ నడుస్తోంది. రచ్చలు, వివాదాలతో అవినాభావ సంబంధాలున్న రాంగోపాల్‌వర్మను “రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి” అని విలేకరులు ప్రశ్నించారు. ఆయన ఏ మాత్రం తడుముకోకుండా “రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది” అని సినీ భాషలో చెప్పి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
జనవరి ఒకటిన విడుదల కానున్న 'బ్యూటిఫుల్' సినిమా ప్రచారంలో భాగంగా ఆయన సినిమా యూనిట్‌తో కలిసి శుక్రవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు రాజకీయ అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. విశాఖకు పరిపాలన రాజధాని తరలించడంపై స్పందించాలని కోరగా….ఎక్కడి నుంచి పాలించినా ఫర్వాలేదని చెప్పాడు. అయినా రాజధాని ఎక్కడ ఉంటే ఏంటని ఆయన ఎదురు ప్రశ్నించాడు. సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని తేల్చేశాడు.
ప్రతి పట్టణాన్ని ఒక రాజధానిగా చేస్తే ప్రజలకు నేరుగా పాలన అందుతుందన్నారు. రాజధానిని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా తాను పట్టించుకోనని వర్మ మార్క్ బదులిచ్చాడు. రాజధానుల తరలింపుపై అంత పెద్ద ప్రచారం, రాద్ధాంతం కూడా అవసరం లేదని వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.