ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వానికి స్థిరాభిప్రాయం ఉండవచ్చు గాక.. దాన్ని వారు మార్చుకోకపోవచ్చు గాక.. కానీ.. ఈ విషయంలో ఇంకా కొంతకాలం సస్పెన్స్ కొనసాగే పరిస్థితి ఏర్పడింది.
అమరావతి ఒక్క రాజధానిగా ఉంటుందా? జగన్ శాసనసభలో చెప్పినట్లుగా మూడు రాజధానులు ఉంటాయా? అనే విషయంలో సస్పెన్స్ ముడి విప్పకుండానే.. మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ విషయంలో ప్రస్తుతానికి హైపవర్ కమిటీని నియమించారు. రాజధాని ప్రాంతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కూడా నిర్ణయించారు. కానీ రాజధాని అక్కడే ఉంటుందా? తరలిపోతుందా? అనేది మాత్రం సస్పెన్సుగా మిగిల్చారు.
జగన్ సారథ్యంలో శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం.. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు. అమరావతిలో రాజధాని పేరిట జరిగిన అక్రమాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కలల రాజధాని ముసుగులో ఎంత ఆర్థిక భారాన్ని రాష్ట్రం మోయవలసి ఉంటుందో కూడా స్పష్టంగా వివరించారు.
ఒకవైపు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న తమ ప్రభుత్వం.. రాజధాని నిర్మాణం పేరిట భారీగా అవసరమయ్యే నిదులను సమీకరించుకోవడం ఎంత కష్టమో కూడా వివరించారు. ఇన్ని సంక్లిష్టతల మధ్యలో.. రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ముగించారు.
అమరావతి ప్రాంత రైతులు పెద్దస్థాయిలో ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గినట్లుగా ఈ చర్య మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి… ఇంతకంటె వేరే మార్గం కూడా కనిపించదు. ఇప్పటికిప్పుడు.. నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు మార్గం చెప్పండి.. ఆమేరకు పనులు చేపడుతాం.. అంటే జవాబు చెప్పగల వారు లేరు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి గొడవను వాయిదా వేసి.. తతిమ్మావిషయాల మీదనే కేబినెట్ భేటీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
కానీ.. రాజధాని ఒకేచోట ఉంటే ఏంటి? మూడు చోట్లకు విస్తరిస్తే ఏంటి? అనే అంశాలపై చర్చ జరగాల్సి ఉంది. ప్రజలు ఆలోచించాల్సి ఉంది. అందుకే గ్రేట్ ఆంధ్ర చేస్తున్న ప్రయత్నమే ఈ విశ్లేషణ
ఏంటి నొప్పి?
29 గ్రామాల ప్రజలు ఆర్థికంగా అతి స్వల్పంగా నష్టపోతున్నారు గనుక.. వారి ఆర్థిక ఆశలను తీర్చడం కోసం… యావత్ రాష్ట్ర సమష్టి ప్రయోజనాలను పణంగా పెట్టాలా? అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండి తీరాలనే వారి ఆందోళనలకు మద్దతిస్తున్న వారిని గమనిస్తే ఇలాంటి ప్రశ్నే అడగాలని అనిపిస్తుంది. రాజధాని అనేది ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. ఒక కులానికి సంబంధించినది కాదు. కానీ.. విషాదం ఏంటంటే… ఒక ప్రాంతంలో మాత్రమే జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని యావత్తు రాష్ట్ర సమష్టి ప్రయోజనాలను తుంగలతో తొక్కాలని విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారాన్ని వికేంద్రీకరించి.. ఒక కొత్తతరహా పాలనను రాష్ట్ర ప్రజలకు రుచిచూపించాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల ఆలోచనతో ఎవరికి ఏం నొప్పి కలుగుతున్నదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
మూడు రాజధానుల ఆలోచనల్ని పాపంగా అభివర్ణించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. జగన్ ఆ మాట చెప్పినరోజునుంచి నానా యాగీ చేస్తున్నాయి. అయితే ఈ ఆలోచనను ‘ఎందుకు’ వ్యతిరేకించాలి అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఇదమిత్థంగా తేల్చి చెప్పలేకపోతున్నారు.
కేవలం ముఖ్యమంత్రి మరియు మంత్రులు అమరావతి మరియు విశాఖ మధ్యలో తిరుగుతూ ఉండాలా? అనేదే వారి ప్రశ్నగా ఉంది. అది వారికి మాత్రం సంబంధించిన సమస్య. అది కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రమే అలా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. ఇక ప్రజలకు సమస్య ఏం ఉంది. ఎగ్జిక్యూటివ్ రాజధాని మొత్తం ఒకేచోట ఉంటుంది గనుక.. ప్రజలు అటువైపే ప్రధానంగా వెళుతుంటారు. శాసనసభ రాజధాని వైపు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక హైకోర్టుకు పాలనకు సంబంధం లేదు. దానితో పని ఉండేవాళ్లకు పరిపాలనతో పని ఉంటుందనుకోలేం. న్యాయపరమైన అవసరాలు ఉండేవాళ్లు కర్నూలుకు తిరుగుతుంటారు. అక్కడితో అంతా సవ్యంగానే ఉంటుంది. మరి ఈ విషయంలో ఇంత గోల ఎందుకు?
విపక్ష నాయకులు మింగలేక.. కక్కలేక…
తెలుగుదేశం పార్టీ.. అమరావతి రాజధానికి అనుకూలమే. కానీ.. విశాఖలో, కర్నూలులో జగన్మోహన రెడ్డి ప్రతిపాదించిన రాజధాని రూప అభివృద్ధి వద్దు అని చెప్పడం వారికి ఎలా కుదురుతుంది. ఆ ప్రాంతాలకు చెందిన తెదేపా నాయకులు మధనపడిపోతున్నారు. జగన్మోహనరెడ్డి పుణ్యమాని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంచి అభివృద్ధి జరుగుతుందనే ఆశ వారిలో కనిపిస్తోంది. అయితే.. బాహాటంగా ఆ విషయం చెప్పడానికి వారు మొహమాట పడుతున్నారు. చంద్రబాబునాయుడు వారిని నిలువరిస్తున్నారు.
మూడుచోట్ల రాజధాని అభివృద్ధి చెందుతుందంటే.. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల వాసులకు కూడా పండగ కింద లెక్క. పార్టీలతో నిమిత్తం లేకుండా.. ఆ ప్రాంతాల ప్రజలు ఇందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. అయితే.. విపక్షాల్లో ఉన్న వారికి ఆ మాట బయటకు చెప్పే తెగువ లేదు.
చంద్రబాబు హైదరాబాదు విషయంలో తప్పు చేసినట్టుగానే అభివృద్ధిని మొత్తం అమరావతికే కట్టబెట్టేస్తానంటే.. ఇన్నాళ్లూ పార్టీలో అంతా డూడూ బసవన్నల్లాగా తలలు ఊపారు. కానీ ఇప్పుడు జగన్ ప్రత్యామ్నాయ ఆలోచన, అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి చెప్పేసరికి కాదనలేకపోతున్నారు. తమ ప్రాంతం కూడా బాగుపడుతుందంటే.. వారి మనస్సాక్షి అందుకు జై కొడుతోంది. కానీ.. చంద్రబాబునాయుడు పార్టీ నాయకులందరికీ ముందుగానే తలంటేసినట్లు కనిపిస్తోంది. బాబును ధిక్కరించడానికి సిద్ధపడిపోయిన గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు మాత్రం.. తమ తమ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆలోచనను సమర్థించారు. మిగిలిన వారు మిన్నకుండిపోతున్నారు. అలాగని.. అమరావతిలోనే రాజధాని ఉండితీరాలంటూ పట్టుపడితే.. జనం తమను ఛీత్కరించుకుంటారని వారికి భయం. అందుకే.. వారు జగన్ ఆలోచనకు వ్యతిరేకంగా నోరు మెదపడం లేదు. చెదురుమదురుగా మాత్రమే ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత బయటకు వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అమరావతికోసం పోరాడాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు తుస్సు మంది!
ఎలా న్యాయం జరుగుతుందో చెప్తే చాలు
నిజానికి రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు గనుక.. సాగుతున్నాయి గానీ.. రాజధాని ప్రాంత రైతులు కూడా ఆందోళన చెందే అవసరమేం లేదు. రాజధానికోసం వారు కేటాయించిన భూములను తీర్చేశారు. మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడే ఉంది. భూముల విలువ పడిపోయేదేం ఉండదు. కాకపోతే.. వారు రాజధానికి భూములివ్వడం ద్వారా ఊహించుకున్న విలువలో కొంత తరుగుదల ఉండవచ్చు. అయినా సరే.. సాధారణంగా వ్యవసాయభూములుగా వాటికి ఉన్న విలువ కంటే.. ఆ ప్రాంతంనుంచి రాజధాని తరలిపోయినా కూడా.. వారికి ఎక్కువ మొత్తమే లభిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో.. కొత్త ఆలోచన వల్ల.. అన్ని ప్రాంతాలకు ఎలా న్యాయం జరుగుతుందో జగన్ సర్కారు రాష్ట్ర ప్రజలందరికీ నచ్చజెబితే చాలు. ఇప్పుడు రాజకీయశక్తులు నడిపిస్తున్నాయి గనక.. కొంత ఆందోళన చేస్తారు గానీ.. తర్వాత నెమ్మదిగా వారే అర్థం చేసుకుంటారు.
స్థూలంగా ఒక్క విషయం అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం 29 గ్రామాల వారికి ‘‘లాభాలు’’ తగ్గిపోతాయి గనుక.. యావత్తు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం అనేది అర్థం లేని పని. ఆ వివేచనతో వ్యవహరిస్తే.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎవ్వరూ అడ్డు చెప్పరు.